తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటింటా చమురు మంట... సామాన్యులపైనే భారం - petrol hike news

కరోనా కాలంలో విలవిల్లాడుతున్న ప్రజలను ఇప్పుడు చమురు ధరలు మరింత దెబ్బతీస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై భారాన్ని మోపుతున్నాయి. ప్రధానంగా రవాణా ఛార్జీలు అమాంతం అధికమయ్యాయి. ఆ మోతలన్నీ అంతిమంగా ప్రజల నడ్డివిరుస్తున్నాయి. వెంటనే కూరగాయలపై ఆ ప్రభావం బాగా కనిపిస్తోంది.

petro hike effect on people
petro hike effect on people

By

Published : Jul 3, 2020, 10:50 AM IST

డీజిల్‌, పెట్రోలు ధరల పెరుగుదల.. సేద్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నెలకు అదనంగా రూ.225 కోట్లకు పైగా ఖర్చు పెరిగిందని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాల లెక్కలను ఈ శాఖ సేకరించింది. రాష్ట్రంలో లక్షకు పైగా ట్రాక్టర్లున్నాయి. దుక్కులు, ఇతర పనుల కోసం ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు సగటున 50 లీటర్ల డీజిల్‌ వాడతారు. గతేడాది వానాకాలంతో పోలిస్తే ఇప్పుడు లీటరు డీజిల్‌ ధర రూ.65 నుంచి 80కి చేరింది. ఇలా లక్ష ట్రాక్టర్లకు ఒక్కోరోజుకు అదనంగా రూ.7.50 కోట్ల ఖర్చు పెరిగింది. ఈ లెక్కన నెలకు కనిష్ఠంగా రూ.225 కోట్ల భారం అదనంగా రైతులపై పడుతుందని ఓ వ్యవసాయాధికారి ‘ఈనాడు’కు చెప్పారు.

పెరుగుతున్న ధరలు

వాహన సదుపాయం కల్పించకపోతే కూలీలెవరూ పనులకు రావడం లేదు. ఇతర గ్రామాల నుంచి కూలీలను తేవాలంటే వారికి రానూపోను ట్రాక్టర్‌ లేదా ఆటోలు ఏర్పాటుచేయడానికి రవాణా ఖర్చులు రైతులే భరించాలి. కరోనా భయంతో ఒకే ఆటోలో గతంలో మాదిరిగా ఎక్కువమంది కూర్చోవడం లేదు. దీనివల్ల ఎక్కువ ఆటోలు లేదా ట్రాక్టర్లు కిరాయికి తీసుకోవాలి. ఎరువుల కంపెనీలు రైల్వే యార్డులున్న జిల్లా కేంద్రాల్లోనే సరకును టోకు వ్యాపారులకిస్తున్నాయి. అక్కడి నుంచి గ్రామాలకు లారీలు లేదా వ్యాన్లలో తీసుకెళ్లడానికి రైతుల నుంచి ఒక్కో ఎరువు బస్తాపై అదనంగా రూ.20 నుంచి 30 దాకా వసూలు చేస్తున్నారని ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన రైతులు చెప్పారు.

పేరుకు పోతున్నాయి...

ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియలో భాగంగా వచ్చే ఉప ఉత్పత్తులు మిల్లుల వద్ద పేరుకుపోతున్నాయి. పొట్టు, తవుడు తదితర ఉప ఉత్పత్తులను కొనుగోలు చేసే నాధుడు లేడు. నిర్మాణ రంగం దాదాపుగా నిలిచిపోవటంతో ఇటుకల తయారీ కూడా మందగించింది. ఇటుకల తయారీలో రైస్‌ మిల్లుల నుంచి వచ్చే పొట్టు, ఊకను అధికంగా వినియోగిస్తారు. కోళ్లకు వేడి వాతావరణం కల్పించేందుకు పొట్టును కోళ్ల ఫారాల్లో నేలపై పరుస్తారు. రోజు రోజుకు అవి కుప్పలు కుప్పలుగా పెరుగుతుండటంతో ఉచితంగా ఇచ్చేందుకు కొందరు మిల్లర్లు ముందుకు వచ్చినా తీసుకెళ్లేందుకు అనుబంధ పరిశ్రమల నిర్వాహకులు ఆసక్తి చూపడం లేదు.

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పక్షం రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. వేసవికాలంలో సాగుచేసిన పంటలు చివరికి రావడం వల్ల రాష్ట్రంలో దిగుబడులు బాగా తగ్గిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తేనే ఇక్కడ మార్కెట్‌ అవసరాలు తీరుతున్నాయి. రెండురోజులుగా హైదరాబాద్‌ మార్కెట్లకు వచ్చిన వాటిలో 56 శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవేనని మార్కెటింగ్‌ శాఖ అధ్యయనంలో తేలింది. ఈ పదిహేను రోజుల్లో పలు కూరగాయల ధరలు 50 శాతం వరకు పెరిగాయి. ఉదాహరణకు టమాటాల కిలో ధర జూన్‌ మొదటివారంలో రూ.10 ఉండగా ఇప్పుడు రైతుబజార్లలోనే రూ.42కి, బయట చిల్లర మార్కెట్‌లో రూ.60 నుంచి రూ.70కి అమ్ముతున్నారు. క్యాప్సికం, బీరకాయ వంటి వాటి ధర రూ.65 నుంచి రూ.80 దాకా పలుకుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి లారీలు రాకపోతే ఇక్కడ కొరత ఏర్పడడంతో పాటు ధరలు పెరుగుతున్నాయి. ఉదాహరణకు క్యాబేజీ మంగళవారం హైదరాబాద్‌ టోకు మార్కెట్లకు 891 క్వింటాళ్లు రాగా బుధవారం 432 క్వింటాళ్లే వచ్చింది. ఫలితంగా ధరలు మండిపోతున్నాయి.

రాయితీలు నిలిపివేత

రాష్ట్రంలో బిందుసేద్యం, కూరగాయల విత్తనాల రాయితీలు నిలిపివేశారు. కూరగాయల పంటల విత్తనాలపై రాయితీలు నిలిపివేసిన మాట వాస్తవమేనని ప్రభుత్వం నిధులిస్తే మళ్లీ ఇస్తామని ఉద్యాన సంచాలకుడు వెంకట్రాంరెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. పందిళ్లు వేయడానికి, ప్లాస్టిక్‌ బుట్టలకు, బిందుసేద్యానికి ఇచ్చే రాయితీలను నిలిపివేసింది కూడా వాస్తవమేనన్నారు. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం బాగా తక్కువగా ఉందని, వేసవిలో ఎండలకు రైతులు వేయలేదని ఇప్పుడు వర్షాలకు సాగు ప్రారంభించారని మరో నెల తరవాత దిగుబడులు వస్తాయన్నారు.

ఒక ట్రిప్పు కూరగాయలే కొంటున్నా

సంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌, కర్ణాటకలోని రాయచూర్‌ నుంచి రోజూ రెండు ట్రిప్పుల్లో కూరగాయలు తెప్పించుకుని విక్రయించే వాడిని. రెండు ట్రిప్పులకు డీజిల్‌ ఖర్చు రూ.3,200 వచ్చేది. ఇప్పుడు రూ.4,600 అవుతోంది.

- చంద్రికా రవికాంత్‌యాదవ్‌, నారాయణపేట

క్యాన్‌కు రూ.30 పెరిగింది

ప్రతి రోజూ పాలను హైదరాబాద్‌లోని బాలానగర్‌కు పంపుతాను. ఇంతకుముందు క్యాన్‌కు రూ.80 చెల్లించే వాడిని. ఇప్పుడు రూ.30 అదనంగా ఇస్తేనే తీసుకెళతానని ఆటోవాళ్లు చెబుతున్నారు. పాల ధరను లీటరుకు రూపాయి పెంచుతానంటే కొనుగోలుదారులు పాలు వద్దంటున్నారు.

- దామోదర్‌రెడ్డి, గుమ్మడిదల, సంగారెడ్డి

ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details