నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్‌కు సమీపంలో కొత్తగా పెట్రోలు పంపు ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ పిల్ దాఖలు చేయడంలో దురుద్దేశాలున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. దురుద్దేశపూర్వకంగా ప్రజాప్రయోజన పిటిషన్‌ను దాఖలు చేసినందున రూ.50 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. నల్గొండ జిల్లాకు చెందిన బి.ఎ. వెంకటేశ్వర్లు మరో పెట్రోలు బంకులో పనిచేస్తున్నారని.. పిటిషనర్ వెనుక మరొకరున్నారని తెలుస్తోందని హైకోర్టు పేర్కొంది.
ఆ మొత్తాన్ని న్యాయవాదుల సంక్షేమ నిధికి రెండు వారాల్లో చెల్లించాలని.. లేదంటే ఈ వ్యవహారాన్ని కోర్టు దిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. నాగార్జునసాగర్ డ్యామ్‌కు సమీపంలో నూతన పెట్రోలు బంకు ఏర్పాటుకు అనుమతించకుండా ఆదేశాలివ్వాలంటూ వెంకటేశ్వర్లు పిల్ దాఖలు చేశారు.