తెలంగాణ

telangana

ETV Bharat / state

TS News: ప్రాంక్‌ చేస్తే.. ‘గే’లి చేస్తున్నారు! - నటనపై ఇష్టంతో వీడియోలు

ఓ వ్యక్తికి నటన అంటే చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టమే అతనికి ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఓ క్రమంలో అతను ప్రాంక్​ వీడియో చేసి గే పాత్రలో నటించేవాడు. ఆ పాత్రలో పూర్తిగా లీనమై జీవించి న్యాయం చేసేవాడు. కానీ ప్రస్తుతం అతను బయటకు కనిపిస్తే చాలు.. అనేక మంది గే అని అంటున్నారని, మరికొంత మంది మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ పని కూడా ఇవ్వడం లేదని ఆయన చెబుతున్నాడు. ఈ మేరకు అతను బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

prank news problems
TS News: ప్రాంక్‌ చేస్తే.. ‘గే’లి చేస్తున్నారు!

By

Published : May 31, 2021, 10:23 AM IST

‘నేను ఒక ప్రాంక్‌ వీడియోలో ‘గే’గా నటించాను.. రెండు సంవత్సరాలుగా ఇలా నటనలోనే ఉన్నాను.. అయితే ఇప్పుడు నన్ను చాలా మంది ‘గే’లి చేస్తున్నారు’ అంటూ ఓ యువకుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఏపీలోని కృష్ణా జిల్లా వీరులపాడు మండలం నందబాడుకు చెందిన జూపూడి ఏసుబాబు అలియాస్‌ కుమార్‌ నటనపై ఇష్టంతో కొన్నేళ్ల క్రితం హైదరాబాద్​ నగరానికి వచ్చాడు. సినీ పరిశ్రమలో సెట్‌వర్క్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నటనపై ఉన్న ఇష్టంతో ప్రాంక్‌ వీడియోలు చేయడం ప్రారంభించాడు.

ఇలా ‘గే’ పాత్రతో ఒక ప్రాంక్‌ వీడియో చేశాడు. ఇప్పుడు అందరూ తనను నిజంగా అలానే చూస్తున్నారని, తాను అలాంటి వాడిని కాదని, మానసికంగా తాను ఎంతో బాధపడుతున్నట్లు ఆదివారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదే ఆలోచనతో తనను పనికి సైతం ఎవరూ పిలవడం లేదని, తాగునీరు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని, భోజనానికి చాలా ఇబ్బందిగా ఉందన్నారు. అందరూ తనను అలా చూస్తుంటే, పిలుస్తుంటే చాలా ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు.

తాను నడుచుకుంటూ వెళ్తుంటే వెనుకనుంచి వచ్చి ఎవరో కొడుతున్నారని, హత్య చేసే అవకాశాలున్నాయన్నారు. వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలని కుమార్‌ ఫిర్యాదు చేశారు. న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:TS News: అ.ని.శాకు చిక్కిన జీహెచ్ఎంసీ డీఈ

ABOUT THE AUTHOR

...view details