Permission to visit the President's residence in Bollaram: సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ప్రజలు సందర్శించేందుకు అధికారులు అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శన వేళలుగా నిర్ణయించారు. దీంతో హైదరాబాద్ నగరప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున రాష్ట్రపతి నిలయం అందాలను అస్వాదించేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
రాష్ట్రపతి విడిదిలోని అందాలను చూసి ఆనందిస్తున్నారు. నిలయం ఆవరణలోని వనాల్లో కలియ తిరుగుతున్న సందర్శకులు సంతోషం ప్రకటిస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రపతి విడిది సందర్శనను అధికారులు రద్దు చేశారు. ఇప్పుడు పరిస్థితులు కుదుట పడటంతో మళ్లీ రాష్ట్రపతి నిలయం సందర్శకులతో కళకళలాడుతోంది.
రాష్ట్రపతి నిలయంలోని ప్రధాన భవనంతోపాటు రాక్ గార్డెన్, ఫౌంటెన్ సందర్శకులకు కొత్త అనుభూతిని పంచుతోంది. ప్రాంగణంలోని చల్లని వాతావరణంతో పిల్లలు, పెద్దలు సేద తీరుతున్నారు. ఇక్కడున్న ఫ్లవర్ గార్డెన్ చూపరులను ఆకట్టుకుంటోంది. 2010లో ప్రతిభాపాటిల్ ఔషధవనాన్ని పెంచి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. వనాన్ని ప్రజలు తిలకించేలా కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు.