సహకార చట్టం కింద అపార్టుమెంట్ల సంక్షేమ సంఘాలను నమోదు చేస్తే పటిష్ఠ రక్షణ ఉంటుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అపార్టుమెంట్లలో నివసించే కుటుంబాల వారు ఒక సంఘంగా ఏ చట్టం కింద నమోదు(రిజిస్టర్) చేయించుకోవాలంటూ ప్రజలు తరచూ పురపాలక, సహకార కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. ‘పరస్పర అవగాహన సహకార సంఘం’(మ్యాక్స్) చట్టం కింద నమోదు చేయమని గతంలో సహకార శాఖ ఆదేశాలిచ్చింది.
కానీ మ్యాక్స్ చట్టం కింద నమోదైన వాటిపై ప్రభుత్వ నియంత్రణ పెద్దగా లేకపోవడంతో సంఘ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తితే వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపడం లేదు. తమ సంఘంలో అవినీతి జరిగిందని లేదా కొందరు సభ్యులే ఏళ్ల తరబడి సంఘ పదవుల్లో ఉంటూ వేధిస్తున్నారని...ఇలా పలు రకాల ఫిర్యాదులు తరచూ పురపాలక, సహకార శాఖలకు వస్తున్నాయి. వీటిని ఎవరు పరిష్కరించాలనేది పెద్ద సమస్యగా మారింది. పురపాలక చట్టం కింద సంఘాన్ని నమోదు చేయనందున తమకు సంబంధం లేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
సహకార శాఖ వారికి తగిన అధికారాల్లేవు. ఎందుకంటే అధికార నియంత్రణ అవసరం లేదనే.. సాధారణంగా మ్యాక్స్ చట్టం కింద రిజిస్టర్ చేయిస్తారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడే అపార్టుమెంటు సంక్షేమ సంఘాలనైనా సహకార చట్టం కింద నమోదు చేయించుకోవాలని సహకార శాఖ సూచిస్తోంది. రాష్ట్ర సహకార చట్టం-1964 కింద సంఘాన్ని నమోదు చేస్తే వాటిపై సహకార శాఖ పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. నమోదుకు ఇటీవల అనుమతి ఇచ్చినట్లు ఈ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘ఈటీవీ భారత్’కు చెప్పారు. కొంతమంది ఇప్పటికే ఇలా నమోదు చేయించుకుంటున్నట్టు తెలిపారు. అయితే ఏ చట్టం కింద నమోదు చేయించుకోవాలనేది సంఘ సభ్యుల ఇష్టమేనని స్పష్టం చేశారు.
సహకార చట్టం కింద నమోదు చేయిస్తే...
* ఈ చట్టం కింద నమోదైన సంఘానికి సంబంధించి లెక్కలను తప్పనిసరిగా ఆడిట్ చేయించి సహకార కార్యాలయంలో అందజేయాలి.