తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ లేకున్నా భవన నిర్మాణాలకు అనుమతి - ఎల్​ఎర్​ఎస్​ తాజా వార్తలు

రాష్ట్రంలో ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు చేసుకోని వారూ భవన నిర్మాణాల అనుమతి తీసుకోవచ్చు. ప్రభుత్వం తాజాగా ఈ వెసులుబాటు కల్పించింది. అందుకు మార్గదర్శకాలను, చెల్లించాల్సిన ఫీజులను నిర్దేశిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎల్​ఆర్​ఎస్​ లేకున్నా భవన నిర్మాణాలకు అనుమతి
ఎల్​ఆర్​ఎస్​ లేకున్నా భవన నిర్మాణాలకు అనుమతి

By

Published : Dec 31, 2020, 4:57 AM IST

రాష్ట్రంలో ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులతోపాటు... దరఖాస్తు చేసుకోని వారు కూడా భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది. భవన నిర్మాణ అనుమతులకు మార్గదర్శకాలు, చెల్లించాల్సిన ఫీజులను నిర్దేశిస్తూ... పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే జీహెచ్​ఎంసీ పరిధిలో ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్నవారు, దరఖాస్తు చేసుకోని వారు భవన నిర్మాణ అనుమతులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ సహా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలు ఈ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారు ఎల్​ఆర్​ఎస్​ ఛార్జీలు చెల్లించాలని పేర్కొన్నారు.

ఆగస్టు 28లోపు రిజిస్ట్రేషన్ అయి ఎల్​ఆర్​ఎస్​-2020 మేరకు దరఖాస్తు చేసుకున్నవారు భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీలను భవన నిర్మాణ అనుమతి దరఖాస్తు సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోనివారు ఎల్​ఆర్​ఎస్​ ఛార్జీలతో పాటు.. అపరాధ రుసుం చెల్లించి, భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఎల్​ఆర్​ఎస్​కు జీవో ప్రకారం నిర్దేశించిన ఛార్జీలతో పాటు అదనంగా 33 శాతం కాంపౌండింగ్ ఫీజు, 14 శాతం ఖాళీ స్థలం ఛార్జీలను ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకున్నవారు 25.59లక్షల మంది

ఎల్​ఆర్​ఎస్​ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అక్టోబర్​ 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది రాష్ట్రవ్యాప్తంగా 25.59 లక్షవ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా పలువురు దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది.

నేటితో ముగియనున్న గడువు

2015 నవంబరు రెండో తేదీన ఇచ్చిన జీవో.151 ప్రకారం ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్నవారు ఛార్జీలను చెల్లించేందుకు గడువు గురువారంతో ముగియనుంది ఈ నేపథ్యంలో వారం రోజులుగా చెల్లింపులు పెరిగాయి.

ఒక్క రోజే 6674 రిజిస్ట్రేషన్లు...

రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 6674 రిజిస్ట్రేషన్లు జరిగి ప్రభుత్వానికి 117కోట్ల రూపాయల రాబడి వచ్చింది. ఎల్​ఆర్​ఎస్​ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నాలుగు నెలలుగా నిలిచిపోయాయి. వీటిని అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ఈ నెల 14వ తేదీన ప్రారంభం కాగా ఈ నెలలో 31వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

ఇదీ చదవండి: పిప్రి ఎత్తిపోతల పనులు చేపట్టండి: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details