తెలంగాణ

telangana

ETV Bharat / state

RAINS: దంచికొట్టిన వానలు.. పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు - telangana latest news

ఉత్తర తెలంగాణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో గురువారం భారీ వానలు కురిశాయి. ఒకేరీతిన పడిన వానలకు జల ప్రవాహాలు పోటెత్తాయి. చెరువులు నిండుకుండల్లా మారి.. మత్తళ్లు దుంకుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

RAINS: దంచికొట్టిన వానలు.. పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
RAINS: దంచికొట్టిన వానలు.. పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు

By

Published : Jul 23, 2021, 4:52 AM IST

Updated : Jul 23, 2021, 10:17 AM IST

RAINS: దంచికొట్టిన వానలు.. పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు

రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో గురువారం కురిసిన అతి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి వరద వచ్చి చేరడంతో నిండుకుండల్లా మారాయి. నగరాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వందల గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.

కుమురం భీం జిల్లా వాంకిడిలో 27.30 సెంటీమీటర్ల వాన పడింది. 150 మండలాల్లో ముసురు కొనసాగు తోంది. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్‌, భైంసా పట్టణాలు నీటమునిగాయి. గోదావరిలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. శ్రీరాం సాగర్‌ నుంచి మేడిగడ్డ వరకు నీటిని దిగువకు వదులుతున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో పురపాలక యంత్రాంగం అప్రమత్తమైంది.

తడిసిముద్దయిన ఆదిలాబాద్‌ జిల్లా..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా తడిసిముద్దయింది. నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ఉద్ధృతితో నిర్మల్‌, భైంసా పట్టణాలు నీట మునిగాయి. కుంటాల మండలం వెంకూర్‌ చెరువుకట్ట తెగి ఉప్పొంగిన వరదలో చేను పనులకు వెళ్లిన దంపతులను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం చింతలమాదర జలపాతంలో బుధవారం గల్లంతైన మహారాష్ట్రలోని రాజుర తాలూక దేవడ గ్రామానికి చెందిన రాంవిజయ్‌ లోబడే(23) మృతి చెందాడు. నిర్మల్‌లోని వరద ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు.

* కామారెడ్డి జిల్లాలో 22 ఇళ్లు పూర్తిగా, 111 ఇళ్లు పాక్షికంగా నేలకూలాయి. 17,198 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 7 ఇళ్లు పూర్తిగా, 48 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆరు రోడ్లు కొట్టుకుపోయాయి.

నిండుకుండల్లా చెరువులు..
ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండుకుండల్లా మారాయి. వరంగల్‌ నగరంలో పలు కాలనీలు జలమయం కావడంతో బల్దియా అప్రమత్తమైంది. ఖానాపూర్‌ మండలంలోని పాకాల సరస్సు 19 అడుగులకు చేరింది. ములుగు జిల్లా లక్నవరం సరస్సులో నీటిమట్టం 27 అడుగులకు, రామప్ప చెరువులో 31 అడుగులకు చేరింది.

* ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద సీతవాగు ప్రాంతం, సీతమ్మ నారచీరల ప్రాంతం, స్వామివారి సింహాసనం, ఇనుప వంతెన, సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగిపోయాయి. ఖమ్మం మున్నేరు నది 14 అడుగులకు చేరింది. ఖమ్మం మార్గంలో కొత్తలంకపల్లి వద్ద వరద ఉద్ధృతికి రైల్వే పనుల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. వైరా, బేతుపల్లి జలాశయాలు నీటిమట్టం దాటాయి. కిన్నెరసాని పరవళ్లు తొక్కుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 16 అడుగులకు చేరింది. భద్రాద్రి జిల్లాలో వాగులు పొంగి ప్రవహించడం వల్ల 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
* ఉమ్మడి పాలమూరు జిల్లాలో దుంధుబి, ఊకచెట్టు, మన్నెవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సంగారెడ్డిలోని నల్లవాగు అలుగుపారుతోంది.
* సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలంలో ఇల్లు కూలిపోయినా అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
* ధర్మపురి నేరేళ్లగుట్ట 64వ నంబరు జాతీయ రహదారిపై వరద నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. జగిత్యాల- నిజామాబాద్‌ జాతీయ రహదారిపై గాంధీనగర్‌ వద్ద సైతం రాకపోకలు స్తంభించాయి. వేములవాడ మూలవాగులో చేపల కోసం వెళ్లిన ఆరుగురు జాలర్లు చిక్కుకున్నారు. తాళ్ల సాయంతో వారిని పోలీసులు ఒడ్డుకు చేర్చారు.

కూలీలను రక్షించిన పోలీసులు..
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని జోగన్‌పల్లి పెద్ద చెరువు మత్తడి దూకడంతో వరినాట్ల కోసం వెళ్లిన 21 మంది కూలీలు అందులో చిక్కుకున్నారు. ఎస్సై సతీశ్​ గ్రామస్థుల సహకారంతో వంతెనకు ఇరువైపుల తాళ్లు కట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

కారు వాగులోకి దూసుకెళ్లి ఇద్దరి గల్లంతు..
జగిత్యాల జిల్లా అనంతారం వాగులో గురువారం రాత్రి నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ వాగు వంతెన పైనుంచి ప్రవహిస్తుండడంతో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. గురువారం రాత్రి ఓ కారు అతివేగంగా వచ్చి బారికేడ్లను తోసుకుంటూ ప్రవాహంలోకి దూసుకుపోయింది. అందులోని ముగ్గురు వ్యక్తుల్లోనూ ఒకరు ఒడ్డుకు చేరగా ఇద్దరు గల్లంతయ్యారు.

ఆశ్రమంలో చిక్కుకున్న ఏడుగురు
నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో భారీ వర్షాలకు ఓ ఆశ్రమాన్ని వరద చుట్టేసింది. గురువారం ఏడుగురు వ్యక్తులు అక్కడికి వెళ్లి చిక్కుకుపోయారు. అధికారులు వారిని బయటకు తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌ నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం, అలీసాగర్‌ జలాశయం నుంచి గజ ఈతగాళ్లను రప్పిస్తున్నారు.
రాజధానిలో మూడు రోజులుగా ముసురు
* జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో మూడు రోజులుగా ముసురు పట్టింది. నగరంలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది.హైదరాబాద్‌లో హిమాయత్‌సాగర్‌ ఐదు గేట్లు ఎత్తి మూసీలోకి వరదను వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద రావడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు.
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. 19 ఉపరితల గనుల్లో పనులు పూర్తిగా నిలిపివేశారు. 1,95,765 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయింది.

శివుడికి తప్పని ‘గంగ’ పోటు

గడ్డెన్నవాగు జలాశయం నుంచి విడుదలైన వరద నీటితో భైంసా పట్టణంలోని సుద్దవాగు తీరంలో నిర్మించిన వైకుంఠధామం పూర్తిగా నీట మునగగా.. అందులో ఏర్పాటు చేసిన 15 అడుగుల మహాశివుడి నడుం లోతు వరకు నీరు చేరింది.

యాదాద్రి ఘాట్‌లో జారిపడిన రాళ్లు..

యాదాద్రి ఆలయ దారులు పాక్షికంగా దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం ఆలయ రెండో ఘాట్‌రోడ్డులో కొండపై నుంచి రాళ్లు జారిపడ్డాయి. యాత్రికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కొండపై ఆలయం చెంత ఏర్పాటుచేసిన చలువ పందిళ్లు కూడా ఈదురుగాలులకు కూలిపోయాయి.

మూలవాగులో కుంగిన వంతెన..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగులో నిర్మాణంలో ఉన్న వంతెన భారీ వర్షాలకు గురువారం రాత్రి కుంగింది. మూలవాగు ఉద్ధృతంగా పారడంతో అడుగు భాగంలోని ఇసుక, సిమెంట్‌ దిమ్మెలు కొట్టుకుపోయాయి.

యువకుల్ని రక్షించిన పోలీసులు..

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో గురువాపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కోమటిచేను గ్రామంలోని సల్పాలవాగు చెరువులో చేపల వేటకోసం వెళ్లి చిక్కుకుపోయారు. దేవాపూర్‌ పోలీసులు వారిని రక్షించారు.

ఇదీ చూడండి: RED ALERT: మూడ్రోజుల పాటు ఆ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

Last Updated : Jul 23, 2021, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details