ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ప్రజా సంఘాల ఐకాస నాయకులు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ... గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం ముందు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. రాజసింగ్పై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, దేశద్రోహం కేసులు నమోదు చేసి... రాష్ట్ర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు.
'ఎమ్మెల్యే రాజాసింగ్‌ను రాష్ట్ర బహిష్కరణ చేయాలి'
గోమాంసం తినే వారిని దూషిస్తూ ఇటీవల ఓ సభలో ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను నిరసిస్తూ.. గన్‌పార్కు స్థూపం వద్ద ప్రజాసంఘాల ఐకాస నాయకులు ఆందోళన చేపట్టారు. ఇలాంటి దేశద్రోహులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా రాజాసింగ్ వ్యాఖ్యలున్నాయని నాయకులు ఆరోపించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. దేశ ద్రోహులను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 15న జరిగే బడ్జెట్ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా వెళ్లి... ఎమ్మెల్యే రాజసింగ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:భైంసా ఘటనపై విచారణ జరిపించాలని డీజీపీని కోరిన భాజపా నేతలు