రాష్ట్రంలో కూరగాయల ధరలు(Vegetables Cost in Hyderabad) మండిపోతున్నాయి. మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా కూరగాయలు, ఆకుకూరల ధరల్లో హెచ్చుతగ్గులు వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొవిడ్-19 నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థ... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో నిత్యావసర వస్తువుల ధరలు... ప్రత్యేకించి కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఏ కూరగాయలు తీసుకున్నా... ధరలు కుతకుతమంటున్నాయి. నెల రోజులుగా రాజధాని బహిరంగ మార్కెట్‌లో కూరగాయలు, ఆకుకూరల ధరలు ఆకాశాన్నంటేలా పెరిగాయి. టమాట కిలో ధర గతవారం రూ.50 ఉండగా... రైతుబజార్లలో ఇప్పుడు బోర్డుపై రూ.28గా రాశారు. కానీ రూ.30కిపైనే అమ్ముతున్నారు.
ధరలు ఇలా..
- క్యాప్సికం- రూ.70
- చిక్కుడు- రూ.60
- బీన్స్- రూ.60
- క్యారెట్- రూ.50
- గోరుచిక్కుడు- రూ.40
- బీరకాయ- రూ.40
- సొరకాయ- రూ.40
- క్యాలీఫ్లవర్-రూ.39
- వంకాయ- రూ.35
- టమాట-రూ.28
- ఉల్లిగడ్డ- రూ.24
- ఆలుగడ్డ- రూ.21
- దోసకాయ- రూ.20
మార్కెట్ ఓ విధంగా ఉండాలి. కానీ మనిషికో రేటు చెబుతున్నారు. మార్కెట్లో ఒకే రేటు ఉండాలి. ఎప్పుడూ కూడా అంతే. బీన్స్‌ను ఒకరు రూ.60 కి ఇస్తే... మరొకరు రూ.80 చెప్పారు. మార్కెట్ లోపల రూ.110 ఉంది. ఇంక ఏ రేట్లని కొనాలి? ఇంతకుముందు ఓ రోజు ఉంది. ఇప్పుడు మరో రేటు ఉంది. వర్షాలు పడితే రైతులకు కూడా ఇబ్బందే.
-వినియోగదారులు
బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు అధికంగా ఉన్నా కూడా తమకు మాత్రం మద్దతు ధర లభించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇంతగా చేతులు మారుతున్న సరుకు... ఒక్కో వ్యాపారి తమ లాభాలు అధికంగా వేసుకోవడంతో... వినియోగదారుల దగ్గరకు వచ్చేటప్పటికి రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే రైతుబజార్లలో కాస్త తక్కువగా ఉందంటున్నారు.
భారీ వర్షాల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు తగ్గిపోయింది. పెద్ద వ్యాపారులు నేరుగా రైతుల దగ్గర కొనుగోలు చేసి... నగరానికి తీసుకువస్తున్నారు. ఆ తర్వాత ఇష్టారీతిన రేట్లు నిర్ణయించి విక్రయిస్తున్నారు. లక్షల మంది నగర ప్రజలు ఆదివారం మార్కెట్లోకి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఆ రోజు ధరలు విపరీతంగా పెంచుతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా భారం అధికమైంది. అంతేకాకుండా సాగు ఖర్చు పెరిగింది. అందుకే కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి.