తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాకు బేరాల్లేవమ్మా.. చంపేయటాలే! - లాక్​డౌన్ పట్టించుకోని ప్రజలు న్యూస్

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. మరీ మనమేం చేస్తున్నాం. ఎక్కడైనా తగ్గుతున్నామా? తగ్గడం కాదు కదా! కొంపలు ముంచుకు పోతున్నట్లు రోడ్లపైకి వస్తున్నాం. కరోనా కాటేస్తున్నా.. పక్కోడికి రాసుకు.. పూసుకు తిరుగుతున్నాం. చస్తే ఖననం చేసే దిక్కు లేదని మరిచిపోతున్నాం. ఇలా చేస్తే.. జనాభా లెక్కల్లో కాదు.. కచ్చితంగా కరోనా లెక్కల్లో ఉంటాం. కొంచమైనా బాధ్యత ఉండక్కర్లా..!

people vilolating lock down
కరోనాకు బేరాల్లేవమ్మా.. చంపేయటాలే!

By

Published : Mar 24, 2020, 7:20 PM IST

అయ్యో.. ఆ దేశంలో ఇంతమంది చనిపోతున్నారంటా.. ఈ దేశం కరోనాతో కంగారు పడిపోతుందటా.. ఈ కథలు చెప్పుకోవడం సరే.. మరీ నువ్వేం చేస్తున్నావ్ బాసూ. కాస్తైనా.. మెదడు పోరల్లోని తెలివిని వాడుతున్నావా? అదే బుర్ర ఉందా? ఏహే బయటకు పోతే.. పోయేదేముంది అనుకుంటున్నావా? ఒక్కసారి.. నువ్​ అసత్య ప్రచారాలు చేసే సోషల్ మీడియానే తెరిచి చూడూ.. కరోనా రక్కసికి దేశాలకు దేశాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయక్కడ. చెప్పేది మీకే.. అర్థమవుతోందా?

కరోనాకు బేరాల్లేవమ్మా.. చంపేయటాలే!

జనతా కర్ఫ్యూ.. పూర్తయింది.. చప్పట్లు కొట్టాం. ఇక రోడ్లపై తిరగొచ్చు.. ఒక్కరోజు పాటించి.. ఏదో సాధించామన్న తిక్క మనకెందుకు. ఇదేనా నువ్వు ఆలోచించే తీరు. కొంపలోంచి బయటకు రాకుంటే.. ఏం మునిగిపోతుంది. మనమే.. పూర్తిగా మునిగిపోవాల్సి వస్తుంది. ఏళ్లకు ఏళ్లుగా బయట తిరుగుతున్నాం. కొన్ని రోజులు ఓపిక పట్టలేరా? బయట తిరగకుంటే.. నాకు తోచదంటారు ఒకరు. సిగరెట్ తాగకుంటే నేను ఉండలేనంటారు మరొకరు. ఇక కొంతమంది స్వయంప్రకటిత మేధావులైతే.. నిత్యావసరాలు అంటూ.. సొల్లు చెబుతారు. పోయేది నీ ప్రాణమే.. నువ్వు పోతే.. నీ కుటుంబ పరిస్థితి ఆలోచించు. నువ్వు చేసే పనికి కనీసం వారికి అన్నం కూడా దొరకదు. నీకు రోడ్లపై తిరిగే తిక్కుంటే.. కరోనాకు ఓ తిక్కుంది.. అందరినీ చంపేసే లెక్కుంది.

నిజం చెప్పుకోవాలంటే.. చదువుకున్న కొంతమంది మూర్ఖులే ఇప్పడు ప్రమాదకరం. చదువులేని వ్యక్తి చెప్పింది వింటాడు... ఏదో అవుతుందనే భయంతో ఉంటాడు. చదువుకున్నవాళ్లతోనే.. ఇప్పుడు అసలు సమస్య. తమకే అన్నీ తెలుసనే భ్రమ. ఇక వాళ్లంతా సోషల్ మీడియాలో మేధావులే. జనతా కర్ఫ్యూ పాటించాం.. తగ్గిందా అంటాడొకడు. నువ్ బయటకు రాకుండా సామాజిక దూరం పాటిస్తేనే కదా మహమ్మారి పారిపోయేది. ఆ తెలివి లేకుండా తెలివి తక్కువ ప్రశ్నలెందుకో...? ప్రభుత్వం చెప్పింది వినకుండా.. ఎదురు ప్రశ్నలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటావెందుకో? కరోనా వచ్చిందంటే.. ఎవడి సరదా వాడికి తీర్చేస్తది. కరోనాకు బేరాల్లేవమ్మా!

జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన మనమే.. లాక్ డౌన్ పాటించపోతే ఎలా.. రోజులానే అదే ట్రాఫిక్ సమస్య. నువ్ బయటకొచ్చి చేసేదేముంది. ఇంట్లో ఉండి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకో. నీ ఒక్కడికి కరోనా వస్తే.. చీకట్లోకి వెళ్లేది దేశ భవిష్యత్​. గుర్తుపెట్టుకో .. ప్రస్తుతం ఇంట్లో ఉన్నవాడికంటే.. తోపేవడు లేడిక్కడ.

ఇప్పుడు మనకున్నవి మూడే ఆప్షన్లు

  • ఇంట్లో ఉండటం
  • ఆసుపత్రిలో ఉండటం
  • ఫొటో ఫ్రేముల్లో ఉండటం

ఇదీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

ABOUT THE AUTHOR

...view details