Private Schools Fee Hike in Telangana : హైదరాబాద్లోని తార్నాక దగ్గరలో ఉన్న ఓయూ సమీపంలోని డీడీ కాలనీలో ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 8వ తరగతి ఫీజు రూ.80 వేలు. వచ్చే సంవత్సరం 9వ తరగతి చదివేందుకు రూ.1.20 లక్షలు చెల్లించాలని ఆ పాఠశాల ప్రతినిధులు సమాచారం పంపారు. అంటే పై తరగతికి 50 శాతం వరకు ఫీజు పెంచేశారన్నమాట.
- నగరంలోని కోకాపేటలో ఉన్న ఓ అంతర్జాతీయ పాఠశాలలో ఈ ఏడాది 4వ తరగతికి రూ.1.23 లక్షల ఫీజు ఉంది. అదే వచ్చే సంవత్సరం ఐదో తరగతిలో చేరాలంటే రూ.1.58 లక్షలు చెల్లించాలనే సందేశం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు వెళ్లింది. అంటే పైతరగతికి పాఠశాల ఫీజు అదనంగా రూ.35 వేలు (28 శాతం) పెరిగింది.
ఈ విధంగా తెలంగాణలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారంగా మారుతున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలు.. ముఖ్యంగా కార్పొరేట్, ఇంటర్నేషనల్ బడులు ఇష్టారీతిన ఫీజులను పెంచుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకు పెంచేశాయి. మరికొన్ని కార్పొరేట్ పాఠశాలలు 40-50 శాతం పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి.
2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు కరోనా మహమ్మారి కారణంగా పాత ఫీజులే తీసుకోవాలని సర్కార్ ఆదేశించింది. అలాంటి ఆదేశాలేవీ లేకపోవడంతో పలు పాఠశాలలు 2022-23 విద్యా సంవత్సరంలో బడి ఫీజులు భారీగా పెంచాయి. అలాగే వచ్చే సంవత్సరమూ మరోసారి మోత మోగించనున్నాయి. ఇప్పటికే చాలా పాఠశాలల కొత్త ఫీజుల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయగా.. మరికొన్ని ఈ నెల 15వ తేదీ తర్వాత నిర్ణయించనున్నాయి. ఇదే విషయమై తల్లిదండ్రులు పాఠశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తే తామూ సిబ్బంది వేతనాలను పెంచాలంటూ వాదిస్తున్నాయి. కొన్ని పాఠశాలలు సిబ్బందికి అరకొర జీతాలు పెంచి.. మిగిలిన మొత్తాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.