తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యుల కొరత... ప్రైవేటుకు కరోనా బాధితుల పరుగులు - పీహెచ్‌సీలో వైద్యుల కొరతతో కరోనా బాధితుల ఆందోళన

క్షేత్రస్థాయిలో ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యంపై నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే కరోనా బాధితులకు ప్రస్తుతం పూర్తిస్థాయిలో వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. జనాభాకు తగిన విధంగా ఆరోగ్య కేంద్రాలు లేవు. ఉన్న కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది మరీ తక్కువగా ఉన్నారు. ఫలితంగా మహానగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. ఫలితంగా అటు నగరం నుంచి ఇటు శివార్ల నుంచి వేలాది మంది కరోనా బాధితులు ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో భారీ బిల్లుల బాధ ఉంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నా బాధితులు ఆసక్తి చూపించని పరిస్థితి ఏర్పడింది.

people running after private hospitals as there are no doctors in phc
పీహెచ్‌సీలో వైద్యుల కొరత... ప్రైవేటుకు కరోనా బాధితుల పరుగులు

By

Published : Jul 25, 2020, 8:42 AM IST

గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో (యూహెచ్‌సీ), నగర శివారు జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో ఉంటే కరోనా బాధితులకు ఈ కేంద్రాల ద్వారానే 70 శాతం మందికి ప్రాథమిక వైద్యం అందే అవకాశం ఉండేది.

కానీ దాదాపు అన్ని యూహెచ్‌సీల్లో అన్ని రకాల సిబ్బంది తక్కువగానే ఉన్నారు. కనీసం కరోనా బాధితులకు వైద్య సలహాలు ఇచ్చేందుకు సరిపడ సిబ్బంది లేరు. పైగా వీటి ద్వారానే ఐసోలేషన్‌ కిట్లను పంపిణీ చేయాలి.

సిబ్బంది కొరత వల్ల ఈ బాధ్యతల నుంచి యూహెచ్‌సీలు, పీహెచ్‌సీలు తప్పుకొన్నాయి. ఆ బాధ్యత జీహెచ్‌ఎంసీ బిల్‌ కలెక్టర్లకు అప్పగించారు. అదే ఆశా కార్యకర్తలు కిట్లు అందిస్తే, మందులు ఎలా వాడాలి.. కరోనాను జయించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని విడమర్చి చెప్పేవారు.

సిబ్బంది కొరత వల్ల వేలాది మంది రోగులకు ఈ సలహాలు, సూచనలు సకాలంలో అందడంలేదు. దీంతో బాధితులు హైరానా పడిపోతున్నారు. నగరంలో కొన్ని చోట్ల బస్తీ దవాఖానాల సిబ్బంది సేవలు అందిస్తుండడమే కాస్తలోకాస్త ఊరట.

ఉన్నవారిపై అదనపు భారం!

ప్రస్తుతం యూహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది రాత్రిపగలూ తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఉదయమే కరోనా పరీక్షలు మొదలైతే రాత్రి తొమ్మిది గంటల వరకూ విధుల్లోనే ఉంటున్నారు. రోజూ వందలమందికి పరీక్షలు చేస్తున్నారు. ఫలితాలు వీరే చెప్పాలి. పైగా కొందరు కరోనా బారిన పడ్డారు. దీంతో మిగిలిన వారిపై ఆ పనిభారమూ పడింది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి

  • ప్రతి 25 వేల మంది జనాభాకు ఒక పీహెచ్‌సీ ఉండాలి.
  • రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 75 వేల మందికి ఒక పీహెచ్‌సీ ఉంది.
  • గ్రేటర్‌ పరిధిలో రెండు లక్షల మందికి ఒక యూహెచ్‌సీ ఉంది.
పీహెచ్‌సీలో వైద్యుల కొరత... ప్రైవేటుకు కరోనా బాధితుల పరుగులు

రంగారెడ్డి జిల్లాలో..

  • మొత్తం పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు: 42
  • ఏరియా ఆసుపత్రులు: 2
  • ఉన్న వైద్యులు: 35 మంది
  • భర్తీ చేయాల్సినవి: 32 స్టాఫ్‌నర్సులు, 25 ఏఎన్‌ఎంలు, 6 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు

మేడ్చల్‌ జిల్లాలో

  • మొత్తం పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు: 14
  • ఏరియా ఆసుపత్రి: ఒకటి
  • భర్తీ చేయాల్సినవి: 12 ఏఎన్‌ఎంలు, 22 స్టాఫ్‌ నర్సుల పోస్టులు.

ఇదీ చదవండిఃకొవిడ్‌ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details