ఐదేళ్ల క్రితం ప్రజల ఆనందోత్సాహాలు, కేరింతలతో నిండిన అదే ప్రాంతం.. గురువారం ఉద్యమ నినాదాలతో దద్దరిల్లింది. ఉద్దండరాయునిపాలెం వద్ద అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశం వరకు.. గురువారం అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ‘రాజధాని పరిరక్షణకు- ఆంధ్రుల అమరావతి పాదయాత్ర’ను నిర్వహించారు. శంకుస్థాపన ప్రదేశంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ‘నాటి వైభవం- నేటి దుస్థితి’ పేరుతో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
దగాపడ్డ అమరావతి రైతుబిడ్డ
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుంటూరు నుంచి ఉద్దండరాయునిపాలెం వరకు 44 కిలోమీటర్ల దూరం మహా పాదయాత్ర నిర్వహించారు. మరోపక్క రాజధాని గ్రామాల ప్రజలు, రైతుల్లో కొందరు రాయపూడికి, మరికొందరు మందడం గ్రామానికి చేరుకుని.. శంకుస్థాపన ప్రదేశం వరకు పాదయాత్ర నిర్వహించారు. దీనికి మద్దతుగా ‘దగాపడ్డ అమరావతి రైతుబిడ్డ’ పేరుతో రాజధానికి భూములిచ్చిన ఎస్సీ రైతులు ర్యాలీ చేపట్టారు. హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో న్యాయవాదులు హైకోర్టు నుంచి శంకుస్థాపన ప్రదేశానికి ర్యాలీగా వచ్చారు. పాదయాత్రలు, నిరసనల్లో భాజపా, జనసేన మినహా... తెదేపా, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ, నవతరం తదితర పార్టీల నాయకులు, దళిత బహుజన ఫ్రంట్ సహా వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మించేందుకు సహకరిస్తామని శంకుస్థాపన సమయంలో మాటిచ్చిన ప్రధాని మోదీ.. జోక్యం చేసుకుని ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
మోదీజీ మీరే కాపాడాలి..
అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయేతర జేఏసీ, రైతు ప్రతినిధుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 7.50 గంటలకు గుంటూరులోని లక్ష్మీపురం సెంటర్‌లో ఉన్న మదర్ థెరిసా విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో వంద మందికి మించి పాల్గొనేందుకు వీల్లేదని పోలీసులు బుధవారం రాత్రే ఉద్యమకారుల్ని హెచ్చరించారు. దాంతో పరిమిత సంఖ్యలోనే పాదయాత్రలో పాల్గొన్నారు. పోలీసులు తాడు పట్టుకుని, దానికి లోపలే యాత్ర కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. పాదయాత్రలో పాల్గొన్నవారు... ప్రధాని మోదీ చిత్రపటంతో కూడిన భారీ కటౌట్‌ను, రాజధాని శంకుస్థాపన ఘట్టాల చిత్రాలతో కూడిన ఫొటోలను ట్రాక్టర్‌పై ఉంచి యాత్ర కొనసాగించారు. మోదీ ఫొటో ఉన్న టీ షర్టులు ధరించారు.
గోరంట్ల, లాం, తాడికొండ అడ్డరోడ్డు, తాడికొండ, పెదపరిమి, తుళ్లూరు మీదుగా పాదయాత్ర సాగింది. అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, న్యాయవాదులు పాదయాత్రలో చేరారు. దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు, ఐకాస ప్రతినిధులు ఎదురొచ్చి వారితో పాటు కొంతదూరం నడిచి మద్దతు తెలియజేశారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తెదేపా నాయకులు వర్ల రామయ్య, తెనాలి శ్రావణ్‌కుమార్, మన్నవ సుబ్బారావు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధి గద్దె తిరుపతిరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.