తెలంగాణ

telangana

సమస్యల జీవనం: లాక్​డౌన్​ వేళ ఆత్మనూన్యతతో సహజీవనం

లాక్​డౌన్​ వేళ ప్రజలు ఇళ్లకు పరిమితమవటం వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం ఉంటుందో లేదో... తనకూ కరోనా సోకుతుందేమో... లాంటి అత్మన్యూనతా భావాలతో పాటు ఇంట్లోనే ఉంటున్న భార్యాభర్తల మధ్య వస్తున్న మనస్పర్ధలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి వారి కోసం హైదరాబాద్​ రాచకొండ పోలీసులు ప్రారంభించిన ‘సైకో సోషల్‌ కౌన్సెలింగ్‌'కు రోజుకు 50 ఫోన్​కాల్స్​ వస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

By

Published : Jun 16, 2020, 1:08 PM IST

Published : Jun 16, 2020, 1:08 PM IST

people get inferiority feelings in lock down time
లాక్​డౌన్​ వల్ల ఆత్మన్యూనతతో బాధపడుతోన్న ప్రజలు..!

* తండ్రి దినసరి కూలీ. కుటుంబ ఆర్థిక స్థితిగతులను తట్టుకొని కష్టపడి చదువుకొని సాఫ్ట్‌వేర్‌ కొలువు దక్కించుకుంది. ప్రస్తుతం ఆ ఉద్యోగం ఉంటుందో లేదో అనుకుంటూ ఆందోళనకు గురై ఓ మహిళ తుది నిర్ణయం తీసుకోవాలనుకుంది.
* కుటుంబ కలహాలు, ఉద్యోగ ఒత్తిడి తదితర కారణాలతో రాత్రి నిద్ర పట్టడం లేదు. వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ఓ వివాహిత చనిపోవాలనుకొంది.
* మరో వివాహిత లాక్‌డౌన్‌ కంటే ముందు ఊరికెళ్లి అక్కడే ఉండిపోయింది. భర్త ఫోన్‌ ఎత్తడం లేదు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలియక మానసికంగా కుంగిపోయింది. పదేపదే అదే గుర్తుకు వస్తుండడంతో మరణమే శరణ్యం అనుకుంటోంది.
* అటు వర్క్‌ ఫ్రం హోం.. ఇటు ఇంట్లో పని చేయలేక ఇబ్బంది పడుతున్నా.. అనారోగ్యం బారిన పడ్డాను. ఇలానే ఉంటే ఏదో ఒక రోజు తనువు చాలించాల్సి వస్తుందేమోనంటూ మరో ఐటీ ఉద్యోగిని వాపోయింది. ఇలా ఎందరో రాచకొండ పోలీసులు ప్రారంభించిన ‘సైకో సోషల్‌ కౌన్సెలింగ్‌’ను ఆశ్రయిస్తున్నారు. ఒక్క సోమవారమే 50 మందికి పైగా ఫోన్‌ చేశారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

అందుబాటులో మానసిక నిపుణులు..

లాక్‌డౌన్‌లో ఇళ్లలోనే ఉండటంతో చాలా మంది మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌, కాల్‌ చేస్తే చాలు ఫోన్‌లోనే ప్రముఖ మానసిక నిపుణులు కౌన్సెలింగ్‌ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 7న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏడుగురు నిపుణులను అందుబాటులో ఉంచారు. వారు కౌన్సెలింగ్‌ ఇస్తూ బతుకుపై భరోసా కల్పిస్తున్నారు. మొదట్లో 5-6 కాల్స్‌ వచ్చేవి. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత 10-20 వరకు పెరిగాయి. ఇప్పుడు ఆ సంఖ్య 50కి చేరింది.

ఇలాంటివి గుర్తిస్తున్నారు..

* కరోనా నేపథ్యంలో చాలా మంది నాక్కూడా వైరస్‌ సోకుతుందేమో, ఉద్యోగం పోతే ఏం చేయాలి లాంటి ఆలోచనలతో కుంగిపోతున్నారు.
* స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం పెరిగి చాలామందిలో నిద్రలేమి సమస్య వెంటాడుతోంది. అర్ధరాత్రి పడుకుని మధ్యాహ్నం నిద్ర లేవడంతో మానసిక సమస్యలు తలెత్తాయి.
* భార్యభర్తలు ఇంట్లోనే ఉండటంతో మనస్పర్థలు తలెత్తి గొడవలకు దారి తీసింది. ఏప్రిల్‌ చివరి వారం నుంచి గృహహింసకు సంబంధించిన కాల్స్‌ విపరీతంగా పెరిగాయి.
* స్నేహితులు, బంధువులు, సన్నిహితులను కలిసేందుకు అవకాశం లేక ఒంటరిగా మిగిలిపోయామనే భావన వెంటాడింది.

నేరుగా చెప్పుకోలేకపోతున్నారు

-కవిత, మానసిక నిపుణురాలు
రోజు వివిధ తరహా కాల్స్‌ వస్తున్నాయి. రెండ్రోజుల నుంచి మానసిక ఒత్తిడికి సంబంధించిన కాల్స్‌ సంఖ్య భారీగా పెరిగింది. చాలా మంది తమ సమస్యను నేరుగా చెప్పలేకపోతున్నారు. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. స్పష్టత రావడానికి అరగంట నుంచి గంట వరకు సమయం పడుతోంది.

సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు: 040-48214800
సమయం: ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 వరకు(సోమవారం నుంచి శనివారం వరకు)

ABOUT THE AUTHOR

...view details