రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తుండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్‌లో తొలిసారిగా శనివారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఆదిలాబాద్‌లో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల అప్పటికప్పుడు ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలేర్పడి వానలు పడుతున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.
ఉక్కిరి బిక్కిరి: అధిక ఉష్ణోగ్రతలు.. అకాల వర్షాలు - High temperatures
రాష్ట్రంలో ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలేర్పడి వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండగా.. అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
శనివారం అత్యధికంగా రెడ్డిపల్లె(రంగారెడ్డి జిల్లా)లో 3.3, చందనవెల్లిలో 1.9. మొయినాబాద్, షాబాద్‌లో 1.6 సెంటిమీటర్ల వర్షం కురిసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నందున మామిడికాయలు నేలరాలి రైతులు నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన పంట ఉత్పత్తులు సైతం వర్షంలో తడుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారానికి తీవ్రమై వాయుగుండంగా మారే అవకాశముందని రాజారావు చెప్పారు. దీని ప్రభావం తెలంగాణపై ఏ మాత్రం ఉండబోదన్నారు. ఇది మయన్మార్ దిశగా వెళ్లే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు.