Beggars at Traffic Signals in Hyderabad :హైదరాబాద్ మహా నగరంలో నానాటికీ జనాభా పెరుగుతోంది. ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం వచ్చేవారు ఎక్కువ అవుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాలూ పెరుగుతున్నాయి. ఇక కరోనా తర్వాత ప్రజా రవాణాపై ఆధారపడే వారి సంఖ్య తగ్గిపోయింది. అనేకమంది సొంత వాహనాల మీద ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
Hijras at Traffic Signals in Hyderabad : సొంత వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు వాహనదారులకు ఇంకో చిత్రమైన చిక్కులు వచ్చి పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఆయా సిగ్నళ్ల దగ్గర వాహనాలు ఆపినప్పుడు భిక్షాటన చేసే వారు, హిజ్రాలు వచ్చి డబ్బులు అడుగుతూ వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నారు. కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలంటూ బలవంత పెడుతున్నారు. మళ్లీ గ్రీన్ సిగ్నల్ పడేంత వరకు వారిని వదలటం లేదు. దీంతో అక్కడ వాహనాలు ఆపాలంటేనే ప్రజలు జంకుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 334 ట్రాఫిక్ కూడళ్లు ఉన్నాయి. దాదాపు అన్నింటి వద్దా ఇదే పరిస్థితి ఉంది. రెడ్ సిగ్నల్ పడగానే.. వాహనదారుల ముందుకు దూసుకువచ్చి డబ్బులు అడుగుతున్నారు. వీరిలో భిక్షాటన చేసేవాళ్లు, హిజ్రాలు, బెలూన్లు, స్టీరింగ్ కవర్లు, వాహనాలు శుభ్రం చేసే ఇతర వస్తువులు అమ్మేవాళ్లు ఉంటున్నారు. కొన్ని సార్లు వాటిని కొనుగోలు చేయాలని బలవంత పెడుతున్నారు.