రాష్ట్రంలో దాదాపు 45 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరవడం వల్ల ఉదయం నుంచే మందుబాబులు షాపుల ముందు బారులు తీరారు. ఉదయం పదిగంటలకు దుకాణాలు తెరుస్తారని తెలిసి తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యూలో నిల్చున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో దుకాణం ముందు కిలోమీటర్ల మేర బారులు తీరారు.
జనం ఎడం పాటించేలా మద్యం దుకాణాల నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో లాక్‌డౌన్ ఆంక్షలకు పూర్తిగా నీళ్లొదిలారు మద్యం ప్రియులు. అన్ని దుకాణాల ముందు పోలీసులు పహారా కాసినా కొన్నిచోట్ల గొడవలు తప్పలేదు. ఉదయం నుంచే మందు కొనుక్కునేందుకు వేచి చూసి తీరా చేతికి సీసాలు దొరగ్గానే అక్కడే తాగేసి చిందులేశారు. నగర పరిధిలో 178 దుకాణాలు తెరుచుకున్నాయని కంటెయిన్‌మెంట్ జోన్లలో దుకాణాలకు అనుమతివ్వలేదని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.