తెలంగాణ

telangana

ETV Bharat / state

తగ్గిన ప్రయాణ ప్రయాసలు.. అద్దె వాహనాలకే మొగ్గు.. - అద్దె వాహనాలే మీదే ఆధారపడుతున్న నగరవాసులు

లాక్​డౌన్ సడలింపుల కారణంగా నగరంలో చాలా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కానీ ఆర్టీసీ బస్సులు ప్రారంభం కాకపోవడం వల్ల ఉద్యోగులందరూ అద్దె వాహనాలే మీదే ఆధారపడుతున్నారు. అందులో ఎక్కువగా బౌన్స్‌, వెగో లాంటి సంస్థ వాహనాలను వాడుతున్నారు ప్రజలు.

hyderabad people using private transport
తగ్గుతున్న ప్రయాణ ప్రయాసలు

By

Published : Jun 2, 2020, 12:26 PM IST

లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ ఆగిపోయిన నగర జీవనం.. ఇటీవల ఇచ్చిన సడలింపులతో మళ్లీ మొదలైంది. కొన్ని మినహాయింపులు మినహా దాదాపు అన్ని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితి. కానీ కీలక రవాణా వ్యవస్థలు ఆర్టీసీ, మెట్రోలాంటివి ఇంకా మొదలవక పోవడంతో గమ్యం చేరే దారిలేదు. కార్యాలయాలకు, పనికి వెళ్లేందుకు రోజూ ప్రయాస తప్పట్లేదు. ఈ సమయంలో అద్దె వాహనాల అంకుర సంస్థలు నగరవాసికి తిప్పలు తప్పిస్తున్నాయి. గతేడాది చివర్లో అడుగుపెట్టి ఆదరణ పొందిన బౌన్స్‌, వెగో లాంటి సంస్థలు నగరవ్యాప్తంగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాయి. ప్రముఖ అద్దె వాహనాల అంకుర సంస్థ ‘బౌన్స్‌ ఆత్మనిర్భర్‌’ పేరిట కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. బెంగళూరు, హైదరాబాద్‌లలో దీర్ఘకాలిక అద్దె వాహనాల్ని అందించనున్నట్లు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి అంకిత్‌ ఆచార్య ‘ఈనాడు’కు తెలిపారు.

నగరంలో కీలకంగా..

ప్రజారవాణా అందుబాటులో లేకపోవడంతో ఈ అద్దెవాహనాల వైపు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. బౌన్స్‌ అంకుర సంస్థకు చెందిన 3 వేల అద్దె ద్విచక్ర వాహనాలు నగరవ్యాప్తంగా ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలో రోజూ ఇప్పుడు 5-6 వేల రైడ్లు తిరుగుతున్నాయి. లాక్‌డౌన్‌కి ముందు ఈ సంఖ్య 1500 నుంచి 2 వేల వరకు మాత్రమే. కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో నిర్వహణపరంగా జాగ్రత్తలు చేపట్టింది ఆ సంస్థ. ఎప్పటికప్పుడు వాహనాల్ని క్రిమి సంహారక ద్రావణంతో శుభ్రం చేయిస్తోంది.

బౌన్స్‌ ఆత్మనిర్భర్‌’తో దీర్ఘకాలిక అద్దె..!

రోజువారీ అద్దెతో ప్రయాణికులపై ఛార్జీల భారం తగ్గించేందుకు ‘బౌన్స్‌ ఆత్మనిర్భర్‌’ని ప్రవేశపెట్టింది. గ్రేటర్‌ వ్యాప్తంగా ఉన్న తమ ద్విచక్రవాహనాల సంఖ్యను పెంచే ప్రణాళికతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో గంటల వ్యవధికే ఇచ్చే అద్దె కాలాన్ని పెంచింది. 7 రోజుల నుంచి గరిష్ఠంగా నచ్చినన్ని రోజులు అద్దెకు తీసుకునే ఏర్పాట్లు చేసింది. 12 నెలలు, 24 నెలల కాలవ్యవధికి ఒకేసారి అద్దె చెల్లించే వెసులుబాటు ఇచ్చింది. నెలకు రూ.1900 నుంచి రూ.2500 వరకు వసూలు చేయనున్నారు. ఈ ప్రణాళిక బెంగళూరు, హైదరాబాద్‌లో మాత్రమే వర్తిస్తోంది. వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామంది.

ఇవీ చూడండి:నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details