తెలంగాణ

telangana

By

Published : May 7, 2021, 12:15 PM IST

ETV Bharat / state

బ్యాంకు ఖాతాలో నిల్వలు ఉన్నా... అప్పుల కోసం పరుగులు

పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేకున్నా.. బ్యాంకు ఖాతాలో నిల్వలు ఫర్వాలేదనిపించినా.. జనం అప్పుల కోసం పరుగులు తీస్తున్నారు. కరోనా సృష్టిస్తోన్న కల్లోలంలో రేపటి గురించిన ఆందోళన పెరుగుతోంది. కుటుంబ అవసరాలకు డబ్బు ఉన్నా.. భవిష్యత్‌ కలవర పెడుతోంది. మున్ముందు అప్పు దొరకదనే ఉద్దేశంతో కొన్ని చోట్ల మధ్యతరగతి కుటుంబాలు రుణాల బాట పడుతున్నారు.

people-are-take-out-personal-loans-unnecessarily-in-covid-time
బ్యాంకు ఖాతాలో నిల్వలు ఉన్నా... అప్పుల కోసం పరుగులు

హైదరాబాద్ అబిడ్స్‌లోని కార్పొరేట్‌ బ్యాంకులో వ్యక్తిగత/తాకట్టు రుణాలు ఏప్రిల్‌లో 10-15 శాతం వరకూ పెరిగినట్లు బ్యాంక్‌ ఏజెంట్‌ తెలిపారు. ‘మొన్నటి వరకూ ఫోన్‌ చేసి వ్యక్తిగత రుణం కావాలా.. అని అడిగితే చిరాకు పడిన ఖాతాదారులు కూడా దరఖాస్తు చేస్తున్నారంటూ’ ఫిలింనగర్‌కు చెందిన బ్యాంకు మేనేజర్‌ ఒకరు తెలిపారు.

ఇదిగో ఇలా.. దీపక్‌ భవన నిర్మాణ సంస్థలో ఉన్నత ఉద్యోగి. వార్షిక వేతనం రూ.8-9 లక్షల వరకూ వస్తుంది. సొంతూర్లో తల్లిదండ్రుల బాధ్యతతో పాటు కూతురు(8), కుమారుడు(2) ఉన్నారు. గతేడాది కరోనాతో తండ్రి కూతుళ్లు హోం ఐసొలేషన్‌ చికిత్స తీసుకుని బయట పడ్డారు. క్షేత్రస్థాయి విధులు కావటంతో రోజూ తప్పనిసరిగా కార్మికులు, ఇంటి యజమానులతో మాట్లాడాల్సిందే. ఇంట్లో పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో తాను వేరే గది తీసుకుని ఉంటున్నాడు. రెండేళ్ల క్రితమే ఇల్లు కొనుగోలు చేయటంతో బ్యాంకు రుణానికి నెల వాయిదాలు తప్పనిసరిగా మారాయి. ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు భార్య నగలు తాకట్టు పెట్టి రూ.4 లక్షల వరకూ అప్పు పొందారు.

కొన్ని కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం ఫీజులు ముందుగానే చెల్లించమంటూ ఒత్తిడి ప్రారంభించాయి. బోడుప్పల్‌కు చెందిన చిరుద్యోగి అంజన్నకు పదోతరగతి పూర్తి చేసిన కూతురును ఇంటర్‌లో చేర్చేందుకు సిద్ధమయ్యాడు. గతేడాది కొవిడ్‌ నుంచి బయటపడేందుకు చేసిన రూ.2.5 లక్షలు అప్పు తీర్చకుండానే మళ్లీ పిల్లల చదువు కోసం ప్రావిడెంట్‌ ఫండ్‌/బ్యాంకు రుణానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ‘వడ్డీ చెల్లింపు అదనపు భారమైనా మున్ముందు ఎలా ఉంటుందనేది అంచనా వేయలేం. అప్పుడు ఆపద ముంచుకొస్తే దిక్కులు చూడాల్సి ఉంటుంద’నే ఉద్దేశంతోనే భారమైనా రుణం తీసుకున్నట్లు తెలిపారు. కొవిడ్‌ ఎటు వైపు నుంచి మీద పడుతుందోననే అయోమయంలో ఆర్ధిక కష్టాలను అధిగమించేందుకు అప్పుల కోసం పరుగులు తీస్తున్నారు.

అత్యవసర వైద్యం కోసమే?

‘రెండు నెలలుగా వ్యక్తిగత రుణాలు కావాలనే వారు పెరిగారు. క్షేత్ర స్థాయిలో తనిఖీకు వెళ్లినపుడు వివాహం/ గృహ మార్పుల కోసమంటూ ఖాతాదారులు చెబుతున్నారు. నేను పరిశీలించిన కొన్ని చోట్ల.. కొవిడ్‌కు గురై ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన వారు ఉన్నారని’ ఓ బ్యాంకు ఉద్యోగి వివరించారు. 2-3 రోజుల వ్యవధిలో సొమ్ములు చేతికొచ్చే అవకాశం వ్యక్తిగత రుణాలకే ఉంటుంది. బ్యాంకు ఖాతాదారుల్లో అధిక శాతం మెడికల్‌ ఎమర్జెన్సీ కోసమే రుణానికి దరఖాస్తు చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెలా బ్యాంకు తనకు ఇచ్చిన లక్ష్యాన్ని మించిన రుణాలు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఇప్పించానంటూ కార్పొరేట్‌ బ్యాంకు ఏజెంట్‌ ఒకరు తెలిపారు. విలువైన ఆభరణాలు, భూములు ఉన్న వారు.. తనఖా రుణాలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి:స్కోరు తగ్గకుండా.. క్రెడిట్​ కార్డు రద్దు చేసుకోండిలా

ABOUT THE AUTHOR

...view details