తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా భయంతో కార్యాలయాల్లోకి ప్రవేశాల నిలిపివేత - people are requested not to come to government offices

'రండి.. రండి.. మీ సమస్యల పరిష్కారానికి మేమున్నాం' అంటూ మొన్నటి వరకు విధేయతను ప్రదర్శించిన వివిధ విభాగాల అధికారులు ఇప్పుడు మాత్రం దయచేసి కార్యాలయాలకు రాకండని విజ్ఞప్తి చేస్తున్నారు. సందర్శకుల వల్ల కరోనా విస్తరిస్తే సంబంధిత కార్యాలయాలన్నీ మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న ఉద్దేశంతో అధికారులు సందర్శకులను కలవడానికి ఇష్టపడటం లేదు.

government offices not allowing public
కరోనా భయంతో కార్యాలయాల్లోకి ప్రవేశాల నిలిపివేత

By

Published : Jun 25, 2020, 9:23 AM IST

జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీసు ఇంకా అనేక ప్రధాన కార్యాలయాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. దీంతో వివిధ పనుల మీద వచ్చే సందర్శకులను అధికారులు అనుమతించడం లేదు. ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కొంతమంది ఉద్యోగులు కరోనాతో బాధపడుతున్నారు. దీని వల్ల సందర్శకుల వల్ల కూడా కరోనా విస్తరిస్తే సంబంధిత కార్యాలయాలన్నీ మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న ఉద్దేశంతో అధికారులు సందర్శకులను కలవడానికి ఇష్టపడటం లేదు. దీంతో తమ సమస్యల పరిష్కారం ఎలా జరుగుతుందన్న ఆందోళనలో నగర ప్రజలు ఉన్నారు.

తగ్గిన పర్యటనలు!

మహానగర అభివృద్ధిలో భాగంగా వివిధ విభాగాల ఉన్నతాధికారులు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పెద్దఎత్తున పర్యటించేవారు. వైరస్‌ విజృంభిస్తుండటంతో అనేకమంది అధికారులు పర్యటనలను నిలిపివేశారు. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు కూడా హాజరు కావడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పనుల క్షేత్రస్థాయి పరిశీలనలనూ ఆపేశారు. కిందిస్థాయి అధికారుల మీదే భారం వేశారు. మంత్రులు కేటీఆర్, తలసాని, మేయర్‌ రామ్మోహన్, మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ తదితరులు నగరంలో పెద్దఎత్తున పర్యటిస్తున్నా వీరితో సమానంగా అన్ని విభాగాల అధికారులు మాత్రం నగర పర్యటనలు చేయడం లేదు.

జలమండలిలో ఇప్పటి వరకు నలుగురు ఉద్యోగులు కరోనా వైరస్‌తో ఆసుపత్రి పాలయ్యారు. పౌరసేవల కేంద్రంలో పనిచేసే ఉద్యోగి కొవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ స్థాయి అధికారులు మాత్రం కలవడానికి అంగీకరించడం లేదు.

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో కూడా గతంలోలా అన్ని విభాగాలకు సందర్శకులను అనుమతించడం లేదు. అత్యవసరమైతే తప్ప కార్యాలయం లోపలికి ఎవరినీ పంపించడం లేదు.

బల్దియా ప్రధాన కార్యాలయంలో దాదాపు పదిమంది ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడ్డారు. మేయర్‌ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగితోపాటు కారు డ్రైవర్‌కూ వైరస్‌ సోకింది. ఇందువల్ల గూగుల్‌ మీట్‌ వీడియో లింక్‌ను జీహెచ్‌ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా సమస్యలపై ఫిర్యాదుకు అవకాశం కల్పించింది. దీనికి అంతగా స్పందన కన్పించడం లేదు. మొదటిరోజు 13 ఫిర్యాదులే వచ్చాయి. అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి కాబట్టి అధికారులు అద్దాల లోపల ఉండి రోజుకో విభాగం చొప్పున అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.

3 పోలీసు కమిషనరేట్ల పరిధిలో 250 మంది పోలీసులకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వారిలో 220 మంది నగర కమిషనరేట్‌లోనివారే. హైదరాబాద్‌ నగర సీపీ కార్యాలయంలో 8 మంది వైరస్‌తో చికిత్స పొందుతున్నారు. దీంతో ఎవరినీ అనుమతించడం లేదు. ఉన్నతాధికారులు ముందస్తుగా అనుమతిస్తేనే లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు ముందుగా పాజిటివ్‌ రాగా 24 గంటల వ్యవధిలో జరిగిన మరో పరీక్షలో నెగిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సిబ్బంది విషయంలోనూ అప్రమత్తంగా ఉంటున్నారు. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లలోనూ దాదాపు ఇది పరిస్థితి.

ABOUT THE AUTHOR

...view details