తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతులను కొవిడ్​గా నిర్ధరించట్లేదు.. కుటుంబీకుల్లో ఆందోళన - more deaths in hyderabad and not confirming them as corona

కరోనా నిర్ధారణకు పరీక్షల విషయంలో ఓ ప్రభుత్వాసుపత్రి వద్ద తీవ్రజాప్యం చేయడంతో జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి(40) స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లాడు. చికిత్స పొందుతూనే మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఇది కరోనా మృతిగా ఇప్పటివరకు స్థానిక యంత్రాంగానికి సమాచారం అందించలేదు ఆ ఆసుపత్రి. దీంతో ఆఖరి చూపు చూసేందుకూ కుటుంబసభ్యులకు అవకాశం రాలేదు.

people afraid of covid deaths increasing in hyderabad
మృతులను కొవిడ్​గా నిర్ధరించట్లేదు.. కుటుంబీకుల్లో ఆందోళన

By

Published : Jul 10, 2020, 10:24 AM IST

జ్వరానికి చికిత్స కోసం 5 రోజుల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు కాప్రా సర్కిల్‌కి చెందిన ఓ వ్యక్తి(38). ఆరు ఆసుపత్రులు తిరిగి చివరికి ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరాడు. ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చేర్చుకుని ఐసీయూలో ఉంచామని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు సిబ్బంది. ఎవరికీ చూసేందుకు అనుమతివ్వలేదు. ఐదురోజుల తర్వాత ఫోన్‌ చేసి ఊపిరితిత్తుల సమస్యతో చనిపోయాడని చెప్పారు. కానీ, మృతదేహాన్ని ఇవ్వలేదు. కారణమేంటని నిలదీస్తే కరోనా వచ్చిందన్నారు. అయితే ఈ సమాచారాన్ని స్థానిక పోలీస్‌, బల్దియా, వైద్యాధికారులకు అందించలేదు. కుటుంబానికీ ఆఖరి చూపు దక్కనివ్వకుండానే అంత్యక్రియలు జరిపించేశారు.

నగరంలో పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల తీరు మృతుల కుటుంబాల్లో ఆవేదన మిగుల్చుతోంది. యంత్రాంగంలో సమన్వయలోపం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ జబ్బులొచ్చినా చేరే పరిస్థితి లేక ప్రైవేట్‌ ఆసుపత్రుల బాట పడుతున్న బాధితులకు చుక్కలు చూపిస్తున్నాయి. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యలున్న బాధితులను చేర్పించుకుని రోజుల తరబడి ఐసీయూలో చికిత్స అందిస్తున్నాయి. చివరికి చనిపోయాడనే వార్తను కుటుంబసభ్యులకు చేరవేస్తున్నాయి. అయితే అది కొవిడ్‌ మరణమా, ఇతర కారణమా చెప్పకుండా సరైన సమాచారం లేకుండానే అయోమయంలోనే అంత్యక్రియలు జరిపించేస్తున్నాయి. నిలదీసిన వారికి కొవిడ్‌ మృతిగా నిర్ధారిస్తున్నాయి. అయితే ఈ విషయాల్ని జీహెచ్‌ఎంసీ, పోలీస్‌, వైద్యశాఖ సిబ్బందికి తెలియనివ్వకపోవడం గమనార్హం.

అయోమయంలోనే అంత్యక్రియలు..!

సాధారణ జబ్బుతో చనిపోతున్నారా.. కొవిడ్‌తోనా అనే విషయంలో సరైన నిర్ధారణ ఇవ్వట్లేదు ఆసుపత్రి వర్గాలు. ఐసీయూలో రోగులు చనిపోయిన తర్వాత కేవలం కుటుంబసభ్యులకు మాత్రమే ఫోన్‌ చేసి విషయం చెబుతున్నారు. అంత్యక్రియలు చేసేందుకు వారికి అనుమతివ్వకుండానే ప్రైవేట్‌ వ్యక్తులతో నేరుగా శ్మశానవాటికకు తరలించేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. ఆఖరి చూపు కూడా దక్కనివ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు.

నిబంధనలకు విరుద్ధంగా..

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రిలో కొవిడ్‌ మృతుల వివరాల్ని స్థానిక వైద్య, పోలీస్‌ సిబ్బందికి చెప్పాలని డబ్ల్యూహెచ్‌ఓ నిబంధలు చెబుతున్నాయి. మృతి వివరాలు తెలుసుకుని మున్సిపల్‌ సిబ్బంది ఆ ఇంటిని కంటెయిన్‌మెంట్‌గా, కుటుంబసభ్యులను ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించి వైద్యశాఖ పరీక్షలు నిర్వహించాలి. ప్రైవేట్‌ ఆసుపత్రులు ఈ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వెళ్తున్నాయి. స్థానిక అధికారులకు సరైన సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు చేసుకోవాలని చెబుతున్నాయి. ఇది జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

ఇదీ చదవండిఃప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా భయం.. జంకుతున్న అధికారులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details