ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల కోర్టుల్లో ప్రస్తుతం 1,41,214 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. 52 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లాజయదేవ్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
‘‘కేసుల పరిష్కారం విభిన్న విషయాలపై ఆధారపడి ఉంటుంది. విచారణలో జాప్యానికీ న్యాయమూర్తుల పోస్టుల ఖాళీలు, వాయిదాలు, పర్యవేక్షణ కొరవడటం వంటి ఎన్నో కారణాలున్నాయి. ఇప్పటివరకు న్యాయాధికారుల నియామకాలను కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టులు, మరికొన్ని రాష్ట్రాల్లో హైకోర్టులతో సంప్రదించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు చేపడుతున్నాయి. కిందిస్థాయి కోర్టుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను యేటా మార్చి 31న మొదలుపెట్టి అక్టోబరు 31కల్లా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు 2007 జనవరి 4న మాలిక్ మఝర్ కేసులో స్పష్టంచేసింది. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులకు 2016, 2017లో లేఖలు రాసింది. పెరుగుతున్న పెండింగ్ కేసులను దృష్టిలో ఉంచుకొని 2018 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌తోపాటు అన్ని రాష్ట్రాల హైకోర్టులకు న్యాయశాఖ లేఖలు రాసింది’’ అని కిరెన్ రిజిజు వివరించారు.
కేంద్ర మంత్రి వెల్లడించిన ప్రకారం విశాఖపట్నంలో అత్యధికంగా, విజయనగరంలో అతి తక్కువగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో యేటా పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 2016లో 99,720, 2017లో 1,09,941, 2018లో 1,16,736, 2019లో 1,24,534, 2020లో 1,30,580 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం స్పష్టీకరణ