Pending Bills Issue in Telangana :రాష్ట్రంలో బిల్లుల అంశం ఆసక్తికరంగా మారింది.శాసనసభ, శాసనమండలి గతంలో ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేయలేదు. రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపి.. నాలుగింటిని వెనక్కి పంపారు. దీంతో ఇటీవల జరిగిన శాసనసభ, మండలి సమావేశాల్లో (Telangana Assembly Sessions 2023) ఆ నాలుగు బిల్లులను పునఃపరిశీలనకు చేపట్టి మళ్లీ యథాతథంగా ఆమోదించారు. పురపాలక నిబంధనలు, పంచాయతీరాజ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల, డీఎంఈ వయోపరిమితి పెంపునకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లులు అందులో ఉన్నాయి. రెండో మారు ఆమోదిస్తే గవర్నర్ ఆమోదముద్ర వేయక తప్పదని మంత్రులు తెలిపారు.
12 Bills Pending at Governor Tamilisai :మళ్లీ ఆమోదం తెలిపిన నాలుగు బిల్లులతో పాటు మరో ఎనిమిది బిల్లులను కూడా ఇటీవలి సమావేశాల్లో ఆమోదించారు. కీలకమైన ఆర్టీసీ ఉద్యోగుల బిల్లుతోపాటు టిమ్స్ ఆసుపత్రుల బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లు, రెండు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు (Panchayati Raj Act Amendment Bill), కర్మాగారాల చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, మైనార్టీ కమిషన్ చట్ట సవరణ బిల్లులు కూడా ఉభయ సభల ఆమోదం పొందాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును (TSRTC Bill) అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకే గవర్నర్ తమిళిసై మొదట సమ్మతి తెలపలేదు.
Telangana Pending Bills with Governor Tamilisai : రెండు దఫాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణలు కోరి... ఆ తర్వాత అధికారులని పిలిపించుకొని మాట్లాడిన తర్వాతే అనుమతించారు. అది కూడా పది సిఫారసులతో సమ్మతి తెలిపారు. ఆ తర్వాతే ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి ఉభయసభల్లో అదే రోజు ఆమోదముద్ర పడేలా చేసింది. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన మొత్తం 12 బిల్లులను అధికారులు నిర్ణీత నమూనాలో రాజ్ భవన్‌కు పంపారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని పరిశీలించి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.