భాగ్యనగరంలో ఏటా జరిగే రోడ్డుప్రమాదాల్లో మరణించే వారిలో ద్విచక్ర వాహనదారులు మొదటి స్థానంలో ఉంటే పాదచారులు రెండోస్థానంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గతేడాది జరిగిన ప్రమాదాల బాధితుల్లో పాదచారులు 35 శాతానికిపైగా ఉన్నారంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్ఛు ఇటీవల నగరానికి చెందిన ‘ఫుట్‌పాత్ ఇనీషియేటివ్’ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలోనూ పాదచారులకు భద్రత కొరవడినట్లు స్పష్టమవుతోంది. 6 ప్రమాదకర దారుల్ని సంస్థ గుర్తించింది.
కొత్తవి కట్టరు.. పాతవి పట్టించుకోరు
పాదచారుల కోసం ట్రాఫిక్ పోలీసులు, కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదికల ఆధారంగా 2014లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, హైటెక్‌సిటీ వంటి ప్రాంతాల్లో 55 ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ)లను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయినా గుత్తేదారులు మందుకు రాకపోవడంతో 44 ఎఫ్‌బీఓల నిర్మాణ బాధ్యతల్ని హెచ్‌ఎండీఏకు బల్దియా బదిలీ చేసింది. అక్కడా అదే పరిస్థితి. గతేడాది డిసెంబరులో కొత్తగా 52 ఎఫ్‌ఓబీలకు ప్రతిపాదనలు రూపొందించగా ప్రభుత్వం పచ్చజెండా ఊపినా పనులు మొదలు కాలేదు.