Jagga Reddy Fire On Bjp: ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన భాజపా కొత్త సమస్యలను సృష్టిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో భాజపా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణలో విచిత్రమైన ఉద్యమాలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 317 జీవోపై రగడకు మూలకారణం భాజపాయేనని జగ్గారెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో ఉద్యోగులను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు భాజపా యత్నిస్తోందని ఆయన విమర్శించారు. నోట్ల రద్దు దగ్గర నుంచి రైతు చట్టాల వరకు అన్ని సమస్యలను సృష్టించింది భాజపానేనని జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు భాజపా కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణలో పోటీ చేయనున్న అభ్యర్ధులకు నిధులు సమకూర్చేందుకు గుత్తేదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు సేకరించేలా ప్రణాళిక సిద్ధమవుతోందని ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు లేఖ రాస్తానని జగ్గారెడ్డి వివరించారు.