Revanthreddy fires on CM KCR : నిబంధనలను తుంగలో తొక్కి నిర్దేశిత అంతస్తుల కంటే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి కేసీఆర్ కుటుంబం విలువైన భూములను గుంజుకుంటోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇష్టారీతిలో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇవ్వడంతో 60 సంవత్సరాలల్లో జరగనంత ఎక్కువ.. హైదరాబాద్ నగరాన్ని విధ్వంసానికి గురి చేశారని ధ్వజమెత్తారు. విమానాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని 5 అంతస్తుల భవన నిర్మాణాలకు మాత్రమే అనుమతులు ఉంటాయని వివరించారు.
కేబీఆర్ పార్క్ పరిసరాలల్లో వాణిజ్య భవంతుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదని.. అలాంటిది కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ 21 అంతస్తుల భవనం నిర్మాణానికి ఏలా అనుమతిచ్చారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దీనివల్ల పక్కనే ఉన్న కేబీఆర్ ఎకో పార్కులో జీవజాతులకు సహా ప్రజలు తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. మూడు వేల గజాలలో నిబంధనల ప్రకారం... అయిదు అంతస్తులు 60వేలు చదరపు అడుగుల విస్తీర్ణం భవంతి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా 4,78,825 చదరపు అడుగుల నిర్మాణాలు చేసేందుకు అనుమతి ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఇందుకు ప్రతిఫలంగా వంద కోట్లు విలువైన 2,704 గజాల భూమిని నమస్తే తెలంగాణ దామోదర్‌రావు కేవలం రూ. 17 కోట్లకే అప్పనంగా పొందారని ఆరోపణలు గుప్పించారు.