Revanth Reddy on service charge on UPI payments: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్-యూపీఐ చెల్లింపులపై ఛార్జ్ వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించడాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయని యూపీఐ సర్క్యూలర్ ఇవ్వడంపై రేవంత్‌రెడ్డి ట్విటర్ ద్వారా తీవ్రంగా స్పందించారు. పారదర్శక చెల్లింపుల పేరుతో ప్రజలను ఆన్‌లైన్ చెల్లింపులకు కేంద్రం అలవాటు చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఆ చెల్లింపులపై 1.1 శాతం ఛార్జ్ వసూలు చేయడం మోదీ కుటిల నీతికి నిదర్శనమని ద్వజమెత్తారు.
service charge on UPI payments : రూ.10 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్‌పై 1.1 శాతం పన్ను వసూలు చేయడం దారుణమని రేవంత్ ఆరోపించారు. వాటిపై 1.1 శాతం పన్ను వసూలు చేయడం ద్వారా రూ.11 వేల కోట్లు అదనంగా ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. మోదీ హఠావో - దేశ్ బచావో! అంటూ రేవంత్ రెడ్డి ట్విటర్‌లో ట్వీట్ చేశారు. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలన్న వార్తలు గతేడాది ఆగస్టులో జోరుగా వినిపించాయి. ఈ విషయమై రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అధ్యయనం చేస్తోందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే అలాంటి ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2022 ఆగస్టులో స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.