Revanth Reddy letter to Modi: పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను వెంటనే అమలు చేయాలని ప్రధాని మోదీకి.. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వేకోచ్ ఏర్పాటు.. గిరిజన యూనివర్సిటీ, రామగుండంలో 400 మెగావాట్ల విద్యుత్‌ప్లాంట్ ఏర్పాటు గుర్తించి లేఖలో ప్రస్తావించారు.
పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రోత్సాహకాల హామీ నెరవేర్చలేదని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రానికి దక్కాల్సిన ఐఐటీ, ఐఐఏం, వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటివి ఒక్కటి మంజూరు కాలేదని తప్పుపట్టారు. ఐటీఐఆర్ రద్దుతో శిఖర స్థాయికి చేర్చే ఉద్దేశంతో గత సర్కారు ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్టిమెంట్ రీజియన్ - ఐటీఐ ప్రాజెక్టును రద్దు చేయడం వల్ల లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఉన్నా.. కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదని రేవంత్ ఆరోపించారు. తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన కార్మిక వర్గాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోందన్నారు. సింగరేణి ప్రైవేటీకరించాలనుకోవడం నిప్పుతో చెలగాటం ఆడటమేనని ఆయన విమర్శించారు. దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని కృష్ణా జలాలు.. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకున్న నీటి వివాదాలు పరిష్కరించే ప్రయత్నం చేయలేదు సరికదా వాటా తేల్చలేదని లేఖలో పేర్కొన్నారు.