Revanth Reddy on Karnataka election Results : తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్‌చాట్ లో పాల్గొన్న ఆయన.. కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించాలని కేసీఆర్ గట్టి ప్రయత్నం చేశారన్నారు. మైనారిటీ ఓట్లు జేడీఎస్‌కు పడేలా బీజేపీతో కేసీఆర్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. ఎంఐఎం మెజారిటీ స్థానాలు పోటీ చేయకుండా నిలువరించి జేడీఎస్‌కు పరోక్షంగా సపోర్ట్ చేసారని ఆరోపించారు.
అందుకే సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం పాటించారని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో తమ పార్టీకి సుమారు 130పైగా సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి జోస్యం చేశారు. స్థానిక సర్వేలు సైతం ఇదే చెబుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి 9 డిక్లరేషన్లు ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం మ్యానిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. అంతే కాకుండా సరూర్‌నగర్ సభలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌పై క్యారాచరణ కూడా త్వరలోనే ప్రకటిస్తామని రేవంత్ అన్నారు.
అన్ని ఆలోచించే వాగ్దానాలు: ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే తమ పార్టీ హామీలు ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఆర్ధిక నిపుణులతో చర్చించిన అనంతరం రాష్ట్ర ఆర్ధిక వెసులుబాటును దృష్టిలో ఉంచుకొని వాగ్దానాలు చేస్తున్నట్లు పునురుద్ఘటించారు. తాము ఇచ్చిన హామీలు వంద శాతం అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో లోటుపాట్లను సవరించి పారదర్శక పాలన అమలు చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి అసెంబ్లీకి ఒక ఐటీఐ కాలేజీ, ప్రతి పార్లమెంట్‌కు ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఓబీసీ, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల డిక్లరేషన్ తర్వలోనే ప్రకటిస్తామని తెలిపారు.