పెట్రోధరల పెంపు, నిరుద్యోగ సమస్యలపై పోరాడాలని పీసీసీ సమావేశంలో నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారథ్యంలో గాంధీభవన్‌లో తొలిసారిగా పీసీసీ కార్యవర్గం భేటీ జరిగింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ఉద్యమాల కార్యాచరణపై ముఖ్య నేతలు చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర రెడ్డిలు వివరాలు వెల్లడించారు
ఇంధన ధరల పెంపుపై నిరసనలు
పెట్రో ధరల పెంపుపై ఏఐసీసీ దేశావ్యాప్త ఆందోళనలకు ఆదేశాలిచ్చింది. ఏఐసీసీ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 12 నుంచి 17 వరకు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 93 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్‌తో 48 గంటల దీక్ష చేస్తామని నేతలు వెల్లడించారు. ఈనెల 16న 'చలో రాజ్ భవన్ కార్యక్రమం' చేపడతామన్నారు. తెరాస, భాజపా పాలనలో సామాజిక న్యాయం జరగలేదని.. ముఖ్యమంత్రి కుటుంబానికి మాత్రమే మేలు జరిగిందని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.
వారి పాలనలో సామాజిక న్యాయం జరగలేదు
తెరాస, భాజపా పాలనలో సామాజిక న్యాయం జరగలేదని పీసీసీ నేతలు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, ప్రచార కమిటీ ఛైర్మన్ కీలక పదవులు విషయంలో కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం జరిగిందని వెల్లడించారు. ఐదుగురు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంలో కూడా సామాజిక న్యాయం పాటించినట్లు తెలిపారు. ఐదుగురు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులకు పని విభజన జరిగినట్లు పేర్కొన్నారు.
హుజూరాబాద్ నాయకులతో చర్చించి నిర్ణయం
హుజూరాబాద్ ఉప ఎన్నికల సంబంధించి ఉమ్మడి కరీంనగర్ నాయకులతో చర్చించి ముందుకు వెళ్లనున్నట్లు నిర్ణయించారు. ఈ నెల 12న పెట్రోలు ధరలు పెంపునకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల్లో ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒకరు లెక్కన సీనియర్ నాయకులు ఇంఛార్జిలుగా వ్యవహరిస్తారని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. పీసీసీ అధికార ప్రతినిధుల కాలపరిమితి నిన్నటితో ముగిసిందని.. త్వరలో కొత్త అధికార ప్రతినిధులను నియమిస్తామని పీసీసీ నేతలు స్పష్టం చేశారు.
పీసీసీగా రేవంత్ రెడ్డి పదవీ స్వీకరణ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు. రాష్ట్రంలో ఏఐసీసీ ఆదేశాలతో పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళనలు చేస్తాం. ఈనెల 12 నుంచి 17 వరకు పెట్రో ధరల పెంపుపై నిరసనలు చేపడుతాం. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగులకు నియామకాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక లక్ష ఉద్యోగాలంటూ ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి వైఫల్యం చెందారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం. దేశంలోనే రాష్ట్రాన్ని అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చినందుకు సీఎంను అభినందిస్తున్నా. దేశంలో ముఖ్యమంత్రి అక్రమార్జనలో నెంబర్‌వన్‌గా ఎదిగినందుకు వారిని అభినందిస్తున్నాం.- మధు యాష్కీ, కాంగ్రెస్‌ప్రచార కమిటీ ఛైర్మన్
ఇదీ చూడండి: