pcc disciplinary committee on jaggareddy: పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగా తాము భావిస్తున్నామని పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి చెప్పారు. ఇవాళ గాంధీభవన్‌లో సమావేశమైన పీసీసీ క్రమశిక్షణ కమిటీ పలు కీలకమైన అంశాలపై చర్చించినట్లు ఆయన వివరించారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే పార్టీలో చర్చించాలని, ఇంఛార్జిలకు లేఖలు రాయవచ్చని, పార్టీ అంతర్గత విషయాలను బహిర్గతం చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డిని క్రమశిక్షణ కమిటీ పిలిచి మాట్లాడుతుందన్న ఆయన.. ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చర్యలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. సోనియాగాంధీకి జగ్గారెడ్డి రాసిన లేఖ ఏ విధంగా లీక్ అయ్యిందో తెలుసుకుంటామన్న చిన్నారెడ్డి.. నూతన సంవత్సరంలో కొత్త సంస్కృతిని ఆచరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి తామిచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చారని, దానిపై లోతుగా చర్చించి...ఆయన సమాధానంపై కమిటీ సంతృప్తి చెందలేదని వెల్లడించారు. ఇంకోసారి జంగా రాఘవ రెడ్డితో మాట్లాడాల్సి ఉందని కమిటీ భావిస్తున్నట్లు వివరించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావ్ అనుచరులు వీహెచ్ వాహనంపై దాడి చేశారని, ఆ ఘటనపై డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావులతో లోతుగా చర్చించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దాడి సమయంలో ప్రేమ్‌సాగర్ రావు ప్రత్యక్షంగా అక్కడ లేరని, పార్టీలో కొన్ని చోట్ల గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి క్రమశిక్షణకు గురైన వారు తిరిగి పార్టీలోకి వస్తామని విజ్ఞప్తులు వస్తున్నాయన్న చిన్నారెడ్డి... వాటిని పీసీసీ దృష్టికి తీసుకెళ్లి వారి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సంస్కృతి మారాలి..