తెలంగాణ

telangana

ETV Bharat / state

పీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామా... కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానం దృష్టి

కాంగ్రెస్‌ పార్టీలో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చర్చ మొదలైంది. గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి... పీసీసీ పదవికి రాజీనామా చేయడం వల్ల పార్టీలో అనిశ్చితి నెలకొంది. పీసీసీ చీఫ్‌ పదవి కోసం పోటీ పడుతున్న నేతల లాబీయింగ్‌ ఊపందుకుంది. పార్టీ సీనియర్‌ నాయకులను కలగలుపుకుని, కాంగ్రెస్‌ను బలోపేతం చేయగలిగే సత్తా కలిగిన నాయకుడు పీసీసీగా రావాలని కాంగ్రెస్‌ శ్రేణులు ఆశిస్తున్నాయి.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామా... కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానం దృష్టి
పీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామా... కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానం దృష్టి

By

Published : Dec 5, 2020, 5:05 AM IST

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు... కాంగ్రెస్‌లో దుమారం రేపాయి. పార్టీ ఓటమికి గురికావడం వల్ల ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నైతిక బాధ్యత వహించి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తరువాత పీసీసీ పగ్గాలు చేపట్టిన ఉత్తమ్‌... దీర్ఘకాలికంగా కొనసాగిన చరిత్ర ఆయనది. 5 సంవత్సరాలా 9 నెలలపాటు పీసీసీ చీఫ్​గా కొనసాగారు.

ప్రతీసారి తిరోగమన ఫలితాలే...

రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికలను మినహాయిస్తే అన్ని ఎన్నికలు కూడా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో జరిగినవే. తాజాగా జరిగిన గ్రేటర్‌ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలో తిరోగమన ఫలితాలే వచ్చాయి. పార్టీ నేతల్లో ఉత్తమ్‌పై తీవ్ర అసంతృప్తి ఉన్నా కూడా పీసీసీ పీఠంపై ఆయననే కొనసాగారు.

చర్చోపచర్చలు...

గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపాలైన తరువాత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మార్పుపై పార్టీలో ఊహాగానాలు వస్తున్నాయి. పార్టీలో అంతర్గతంగా చర్చోపచర్చలు కొనసాగాయి. పీసీసీ అధ్యక్ష పీఠం కోసం డజన్‌ మందికిపైగా నాయకులు అధిష్ఠానానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇంతలో ఏఐసీసీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పీసీసీ ఎంపిక తీవ్ర జాప్యం జరిగింది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డినే పీసీసీగా కొనసాగుతూ వచ్చారు.

నైతిక బాధ్యత వహిస్తూ...

తాజాగా గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందడం వల్ల నైతిక బాధ్యత వహిస్తూ... ఉత్తమ్‌ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆవశ్యకత ఏర్పడింది. ఎంపీలు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతోపాటు పలువురు సీనియర్‌ నేతలు పీసీసీకి పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. ఏఐసీసీ స్థాయిలో పలుమార్లు పీసీసీ ఎంపికపై కసరత్తు జరగడం, ఎంపీ రేవంత్‌ రెడ్డిని పీసీసీగా నియమించే అవకాశం ఉందని ఉప్పందిన ప్రతిసారి... పార్టీ విధేయుల ఫోరం సమావేశం ఏర్పాటు చేసి లేఖ రాయడం చేస్తూ వచ్చారు.

బాహాటంగా వ్యతిరేకం...

పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతురావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు కూడా రేవంత్‌ రెడ్డి ఎంపికను బాహాటంగానే వ్యతిరేకిస్తూ వచ్చారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పీసీసీ అధ్యక్ష హోదాలో ఇటీవల ఇంటర్వ్యూలు ఇచ్చిన సమయంలో గ్రేటర్‌ ఎన్నికల తరువాత కొత్త పీసీసీ అధ్యక్షుడు వస్తారని... పార్టీలో డజన్‌ మంది పోటీలో ఉన్నారని కూడా వెల్లడించారు. ఇటీవల కొందరు సీనియర్‌ నేతలు లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో సమావేశమై పార్టీ చీఫ్‌ మార్పుపై సుదీర్గంగా చర్చించారు.

పీసీసీ పీఠంపై చర్చ...

రెండు రోజుల కిందట బేగంపేటలోని ఓ హోటల్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కుసుమకుమార్‌, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, పోదెం వీరయ్య తదితరులు సమావేశమై పీసీసీ పీఠంపై చర్చించారు.

సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో పార్టీ విధేయుడు, సీనియర్‌, తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బలపరచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమావేశంలో పాల్గొన్న ఓ నాయకుడు తెలిపారు. ఆ మేరకు అధిష్ఠానానికి ఓ లేఖ కూడా రాయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

సీనియర్లను కలగలుపుకుని...

రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కూడా ఉత్తమ్‌ రాజీనామాపై ఆరా తీశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక వరకు తాను కొనసాగుతానని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ దృష్టిసారించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్‌ నేతలను కలగలుపుకుని పార్టీని బలోపేతం చేయగలిగే నాయకుడికే పీసీసీ పీఠం దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే పలువురు సీనియర్‌ నేతల పేర్లను అధిష్ఠానం పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. నేతల అభిప్రాయాలు తీసుకున్న తరువాతనే కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రేసులో ఇద్దరు ఎంపీలు...

ఈనెల 9న సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా... కొత్త పీసీసీని ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇతర నేతలతో పోలిస్తే తాను పార్టీకి విధేయుడనని పీసీసీ రేస్‌లో ఉన్న ఓ ఎంపీ తనకే పీసీసీ అధ్యక్ష పీఠం నిర్ధరణ అయ్యిందని ఒకట్రెండు రోజుల్లోతన పేరును అధిష్ఠానం ప్రకటిస్తుందని వెల్లడించారు. పీసీసీ కోసం డజన్‌ మందికిపైగా పేర్లు అధిష్ఠానం వద్ద ఉన్నప్పటికీ ఇద్దరు ఎంపీల పేర్లు ప్రముఖంగా వినొస్తున్నాయి.

మరో సీనియర్ ఎమ్మెల్యే...

తాజాగా మరొక సీనియర్‌ ఎమ్మెల్యే పేరు కూడా తెరపైకి వచ్చినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అన్ని కోణాల్లో పరిశీలన చేసిన తరువాత ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి నష్టం వాటిళ్లకుండా బలోపేతం కావడానికి అవకాశం ఉన్న నాయకుడిని ఎంపిక చేసే దిశలో ఏఐసీసీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా

ABOUT THE AUTHOR

...view details