దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ కుమార్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో పంటల కొనుగోలు కేంద్రాల ఎత్తివేత, రైతుల పరిస్థితిపై చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ఉత్తమ్ కోరినట్లు తెలిపారు. పార్లమెంట్లో కొత్త వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో వ్యవసాయ చట్టాల వల్ల మద్దతు ధరలకు, కొనుగోలు కేంద్రాలకు ఎలాంటి నష్టం ఉండదని ప్రధాని హోదాలో పదే పదే చెప్పారని లేఖలో గుర్తు చేశారు.
రాష్ట్రపతి ప్రసంగంలోనూ కొత్త వ్యవసాయ చట్టాల వల్ల పంటల మద్దతు ధరలకు, కొనుగోలు కేంద్రాలకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ ముందుగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినట్లు పేర్కొన్నారు. దిల్లీలో కేసీఆర్ మిమ్మల్ని, హోమ్ మంత్రి షాని కలిసిన తర్వాత.. రాష్ట్రంలో దాదాపు 10 వేల పంటల కొనుగోలు కేంద్రాలను మూసేసినట్లు వెల్లడించారు. అందుకు కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలే కారణమని ఆయన పేర్కొన్నారని అన్నారు.