తెలంగాణలో కరోనా వ్యాధి తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ… ప్రజల ప్రాణాలను హరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పంచాయతీ రాజ్ విభాగం సోమవారం జూమ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలనుద్దేశించి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు.
ఇలాంటి పాలన ఎక్కడా లేదు
కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవమానవీయంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో రోగులను తరలించేందుకు అంబులెన్సులు లేవని, ఆస్పత్రుల్లో బెడ్లు లేవని, రోగులకు ఇంజక్షన్లు, మందులు దొరకడం లేదని ఇంత ఘోరమైన పాలన ఎక్కడ లేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో కరోనా వ్యాధికి ఉచిత చికిత్సలు చేస్తుంటే తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులు నిలువునా దోచేస్తున్నా… ఎలాంటి నియంత్రణ చర్యలు లేవని ఆరోపించారు. ప్రపంచ దేశాలకు మందులు సరఫరా చేసే శక్తి కలిగిన తెలంగాణ రాష్ట్రానికి మందులు లేకుండా పోవడం దారుణమన్నారు.