కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రజల ప్రాణాల కంటే వారికి ఎన్నికలే ముఖ్యమని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువ సంఖ్యలో ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేస్తున్న ప్రకటనలకు, వాస్తవానికి చాలా తేడా ఉందన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీ ఆదేశాలతో బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలందరూ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: ఉత్తమ్ - కరోనా కేసులు
కరోనాను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కేసులను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. అధిష్ఠానం ఆదేశాలతో కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
కేసులు తక్కువ చూపిస్తున్నారు..
కరోనా పరీక్షలు తక్కువ సంఖ్యలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఉత్తమ్ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య కూడా తక్కువగా చూపిస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు ఆర్థికభారం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని... ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్, ఆసుపత్రుల్లో పడకలు లాంటి అత్యవసర సౌకర్యాలు కల్పించుటకు కృషి చేయాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.