గాంధీ భవన్లో పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పీవీ సోదరుడు పీవీ మనోహర రావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్సవాల కమీటీ చైర్మన్ గీతా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు తదితరుల జ్యోతిప్రజ్వలనతో వేడుకలు మొదలయ్యాయి. పీవీ నరసింహారావు చిత్ర పటం వద్ద పీవీ సోదరుడు మనోహరరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.
అనంతరం స్వర్గీయ పీవీ నరసింహారావు రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ డాక్యుమెంటరీ ప్రదర్శించారు. వర్చువల్ మీటింగ్ లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రులు చిదంబరం, జైరాం రమేష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాలు తమ సందేశాన్ని అందించారు. ఎన్నటికీ పీవీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ బాటలో నడుస్తూ.. 2023లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.