జాతీయ నేర గణాంక సంస్థ(National Crime Statistics Bureau) విడుదల చేసిన నేర వార్షిక నివేదికపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. 2014 నుంచి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణను అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్, కేటీఆర్ నేరాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రికి కూతవేటు దూరంలో ఉన్న సింగరేణి కాలనీలో చిన్నారిపై దారుణం జరిగితే మహమూద్ అలీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
''మున్సిపల్ ఎన్నికల సమయంలో సింగరేణి కాలనీని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్నారు. అలాంటి సింగరేణి కాలనీలో చిన్నారిపై దారణం జరిగినా మంత్రి స్పందించలేదు. పైగా సరైనా సమాచారం తీసుకోకుండా ట్వీట్ చేశారు. నిందితుడు దొరికాడంటూ ట్వీట్ ఎందుకు చేశారో చెప్పాలి. చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడు దొరికాడో లేదో అనే సందిగ్ధంలో ఉండగా... పోలీసు శాఖ నిందితుడు దొరకలేదని చెప్పి... రివార్డు ప్రకటించారు. ఘటన జరిగి ఆరు రోజులైనా కేటీఆర్‌కు ఆయన చేసిన తప్పు తెలియలేదు. అధికారి తప్పుడు సమాచారం ఇచ్చారని మరో ట్వీట్ చేశారు. మంత్రికి తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.
డ్రగ్స్, నార్కొటిక్స్‌పై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించట్లేదు. అసలు తెలంగాణకు డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? ఎవరు వాటిని వినియోగిస్తున్నారు? ఈ కేసులో ఈడీకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించట్లేదు? ఎవరు పేరు బయటపడుతుందని ప్రభుత్వం భయపడుతుంది? గంజాయిని పండిచడమే తప్పు. అలాంటిది వాటిని వినియోగిస్తున్నా.. కేసీఆర్ ప్రభుత్వం చూసిచూడనట్లు ఎందుకు వ్యవహరిస్తోంది. ఈ కేసుపై పలుమార్లు కోర్టును ఆశ్రయిస్తే... విచారణ చేసేందుకు ఈడీ ముందుకు వచ్చింది. ఈడీ లావాదేవీలు గురించి మాత్రమే విచారణ చేస్తుంది. డ్రగ్స్‌పై విచారణ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. సింగరేణి కాలనీ చిన్నారి ఘటనలో నిందితుడికి కూడా గంజాయి సేవించే అలవాటు ఉందని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మత్తులోకి తోసేస్తుంది.''