తెదేపా, భాజపా, జనసేన రాజకీయంగా విడిపోయాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒకసారి విడిపోయిన తర్వాత మళ్లీ కలవడం తనకు నచ్చదన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో అనంతపురం, హిందూపురం లోక్సభ నియోజకవర్గాల కార్యకర్తలతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జనసేనాని... ఎన్నికలకు ముందు తనను వైకాపా నాయకులు సంప్రదించారని పవన్ చెప్పారు. రాజకీయాల్లో డబ్బులు సంపాదించే వ్యక్తిని కాదన్న పవన్... ఆస్తులు ఎక్కువుంటే పోరాడే శక్తి తగ్గిపోతుందనే.. డబ్బు కూడబెట్టలేదని స్పష్టం చేశారు.
వ్యాపారాలు లేని రాజకీయ నేతలు మాత్రమే ఆదర్శనీయులు అవుతారన్న పవన్... వైకాపా నేతల చీకటి వ్యవహారాలు తనకు తెలుసన్నారు. వైకాపా నేతల బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని ఉద్ఘాటించారు. తన జీవితం, పిల్లల మీద కన్నా సమాజం మీదే మమకారం ఎక్కువన్నారు. ప్రజల ఆవేదన, కష్టాలు చూసే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. దశాబ్దాల పోరాటం తర్వాతే ఏ పార్టీ అయినా సంస్థాగతంగా బలపడుతుందన్నారు.
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశం కోసం కుటుంబాలనే త్యాగం చేస్తారని... వారితో పోటీపడలేమని పవన్ పేర్కొన్నారు. ఫ్యాక్షన్ రాజకీయ నాయకులను జనసేన కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రెండు దశాబ్దాల అంతర్మథనం తర్వాతే రాజకీయాలలోకి వచ్చానన్న పవన్.. అవసరమైతే సమాజం కోసం కుటుంబాన్ని వదలుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
జనసేన నాయకుడు సంచలన వ్యాఖ్యలు