Pawan Kalyan fires on YCP over Ippatam incident: ఇప్పటం గ్రామంలో జనసేన అభిమానుల గడపలు కూల్చిన వైసీపీ సర్కారు గడప తాను కూలుస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పటంలో బాధితులకు పవన్ కల్యాణ్ సాయం అందించారు. 2024లో రాజకీయాలు మారాలని ఆకాంక్షించారు. 2024లో వైసీపీ నేతలు ఎలా గెలుస్తారో చూస్తానన్నారు. వైసీపీ నేతలది ఆధిపత్య అహంకారమని దుయ్యబట్టారు. వారిలా తాను కోడికత్తులతో డ్రామాలు ఆడలేనని విమర్శించారు.
‘‘వైసీపీ రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? మా వాళ్లను బెదిరిస్తారా? మాకు ఎవరూ అండగా ఉండకూడదా? రాజకీయం మీరే చేయాలా? మేం చేయలేమా? చేసి చూపిస్తాం.. ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి తీరుతాం’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తామని.. తమకు ఓట్లు వేసినా, వేయకపోయినా అండగా ఉంటానని చెప్పారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులతో ఆయన సమావేశమయ్యారు. బాధితులకు రూ.లక్ష చొప్పున పవన్ ఆర్థిక సాయం అందజేశారు.
"2014 తర్వాత ప్రధానిని మూడు, నాలుగు సందర్భాల్లో కలిశాను. నేనేం మాట్లాడానో చెప్పాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల అడుగుతున్నారు. నా దగ్గరకు రండి.. మీ చెవిలో చెప్తా. నేనెప్పుడు మాట్లాడినా దేశభద్రత, సగటు మనిషి రక్షణే కోరుకుంటా. నేను మీలా దిల్లీ వెళ్లి చాడీలు చెప్పను. వైకాపాను దెబ్బకొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయను.. నేనే చేస్తా. ఇది నా నేల.. ఈ నేలలోనే పుట్టినోడిని.. ఆంధ్రుడిని.. ఆంధ్రలోనే తేల్చుకుంటా. నా యుద్ధం నేనే చేస్తా. ఇప్పటం గ్రామానికి సమస్య వస్తే దిల్లీ వెళ్లి అడగను. మేమే తేల్చుకుంటాం. అధికారం లేనోడిని.. నామీద పడి ఏడుస్తారేంటి? ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరు ఎలా గెలుస్తారో చూస్తా.’’ -పవన్ కల్యాణ్, జనసేన అధినేత