తెలంగాణ

telangana

ETV Bharat / state

అందరం కలిసి అక్క రత్నప్రభను గెలిపించుకుందాం : పవన్ కల్యాణ్

అధికార వైకాపా సహా ఇతర పార్టీల ప్రచారాలను మరిపించే విధంగా తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన సాగింది. ఆద్యంతం కార్యకర్తలు, అభిమానుల సందోహం మధ్య జనసేనాని ప్రచారాన్ని నిర్వహించారు. బహిరంగ సభలో భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్.. పవన్ సినిమా డైలాగులు చెప్పి అలరించగా.. భాజపా ఎంపీ అభ్యర్థి రత్నప్రభ.. ఎర్రకండువాతో రాఖీ కట్టి సోదరుడిగా అండగా ఉండమని పవన్​ను కోరడం పర్యటనలో అందరినీ ఆకట్టుకుంది.

pavan-kalyan-tirupati-election-campaign-tour
అందరం కలిసి అక్క రత్నప్రభను గెలిపించుకుందాం : పవన్ కల్యాణ్

By

Published : Apr 4, 2021, 9:02 AM IST

భారతీయ జనతాపార్టీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని కోరుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీలోని తిరుపతిలో పర్యటించారు. తొలుత ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్​కు భాజపా-జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ్నుంచి నేరుగా ఎమ్మార్ పల్లికి చేరుకుని పాదయాత్రను ప్రారంభించారు. భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు, కార్యకర్తలను అదుపుచేయడం పోలీసులకు సాధ్యంకాక ఒక దశలో స్వల్ప లాఠీ ఛార్జీ చేశారు. ఫలితంగా పవన్ తన పాదయాత్రను విరమించుకుని వాహనంలోనే శంకరంబాడీ కూడలికి చేరుకున్నారు.

గబ్బర్​సింగ్​ డైలాగులు..

బహిరంగ సభలో భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్​ఛార్జి సునీల్ దేవ్ ధర్ గబ్బర్ సింగ్ డైలాగులు చెప్పి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రాష్ట్రంలో వైకాపా గుండా రాజ్యం నడుస్తుందన్న ఆయన.. గబ్బర్ సింగ్ మాత్రమే వాళ్లకు సమాధానం చెప్పగలడన్నారు.

పవన్​కు ఎర్రకండువా రాఖీ కట్టిన రత్నప్రభ..

భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ.. ఇంటర్​నెట్​లో ట్రోలింగ్​ చేస్తున్నవారిని హెచ్చరించారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చింకుందాం రండి అంటూ వైకాపా నేతలకు సవాల్ విసిరారు. ముందుగా ఎర్రకండువాను పవన్​ చేతికి రాఖీలా కట్టిన కూటమి అభ్యర్థి రత్నప్రభ.. తమ్ముడిగా తనకు అండగా ఉండాలన్నారు. పవన్ నటించిన గోపాలగోపాల చిత్రంలోని డైలాగులను చెప్పి అందరినీ ఉత్సాహపరిచారు.

వైకాపాపై ధ్వజమెత్తిన నాదెండ్ల, సోము..

ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించకుండా ఓటెలా అడుగుతారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైకాపాపై ధ్వజమెత్తారు. బహిరంగ సభ అనంతరం భాజపా నాయకులను ఆత్మీయంగా పలకరించిన పవన్.. సభ ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మొత్తం మీద పవన్ పర్యటన అటు భాజపా- ఇటు జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని ఇరుపార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారు.

అందరం కలిసి అక్క రత్నప్రభను గెలిపించుకుందాం : పవన్ కల్యాణ్

ఇదీ చదవండి:యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. అటువైపే చూడని అధికారులు

ABOUT THE AUTHOR

...view details