జీవనప్రమాణాల వృద్ధికి.. బలమైన పునాది పట్టణం రూపురేఖలు మార్చే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. పురపాలికల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో పట్టణ ప్రగతి కార్యక్రమం రూపుదిద్దుకుంది. పట్టణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తెచ్చే విధంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది.
మార్చి 4 వరకు
మహబూబ్‌నగర్ పట్టణంలో జరగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గోనున్నారు. జిల్లాలు, పట్టణాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించనున్నారు. మార్చి 4 వరకు జరిగే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కావాల్సిన కార్యాచరణ చేపట్టేందుకు ఇప్పటికే అన్ని పురపాలికలకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
పారిశుద్ధ్య నిర్వహణ కీలక అంశం
పట్టణాల్లోని ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌర సేవలు మెరుగు పరచడం వంటి ప్రధానమైన ప్రాథమిక లక్ష్యాలను నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చెత్త తరలించడం మురికి కాలువలు, బహిరంగ ప్రదేశాల శుభ్రపరచ్చడం వంటిని చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పట్టణ ప్రగతి - మార్గదర్శకాలు
- పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వార్డ్ యూనిట్‌గా ఈ కార్యక్రమం చేపట్టాలని ప్రతి వార్డుకి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని పురపాలక శాఖ నిర్ణయించింది.
- రానున్న పది రోజులకు అవసరమైన కార్యక్రమాలు ముందే రూపొందించుకొని ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రహదారుల నిర్వహణ, పచ్చదనం, నర్సరీలు, మరుగుదొడ్ల కోసం అవసరమైన స్థలాలు గుర్తించాలి.
- పట్టణాల్లో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రజారోగ్య పర్యవేక్షణ కార్యక్రమాలు, అవసరమైన క్యాలెండర్ ప్రకటించాలి.
- పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలి. ఘన వ్యర్థాలు, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను చెరువులో కలపకుండా అవసరమైన చర్యలు చేపట్టడంతోపాటు అన్ని గృహ సముదాయాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటు కార్యక్రమం చేపట్టాలి.
- పట్టణ ప్రగతిలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమైన అంశం. ఇందుకోసం ప్రతి వార్డులో కమిటీలను ఏర్పాటు చేసి కనీసం మూడు నెలలకు ఒకసారి వార్డు కమిటీల సమావేశం నిర్వహించాలి.
నూతనంగా ఎన్నికైన పురపాలక ప్రతినిధులు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు పురపాలక ప్రజాప్రతినిధులతోపాటు పురపాలక శాఖ అధికారులు నిబద్ధతతో పని చేయాలని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి లక్ష్యాలు అందుకునేందుకు పురపాలక ప్రజాప్రతినిధులు, అధికారులు, అందరూ కృషి చేయాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: రైతు భరోసా కోసం "అగ్రిటెక్ సౌత్ - 2020"