Mahender Reddy Taken Oath Minister : రాష్ట్ర మంత్రివర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) .. మరోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. మహేందర్ రెడ్డితో అమాత్యుడిగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం గవర్నర్ తమిళిసైతో.. కేసీఆర్ భేటీ అయ్యారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి.. ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలను కేటాయించారు. గనులు, భూగర్భ వనరుల శాఖతో పాటు సమాచార, పౌరసంబంధాల శాఖలకు మంత్రిగా ఆయనను నియమించారు.
Telangana Cabinet Expansion Today 2023 :శాసనసభ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మహేందర్ రెడ్డికి.. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించాలని నిర్ణయించారు. ఈటల రాజేందర్‌ను.. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఖాళీగా ఉన్న స్థానాన్ని ఆయనతో భర్తీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి... తాండూరు టికెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సర్దుబాటులో భాగంగా మహేందర్ రెడ్డి మంత్రి పదవి అవకాశం కల్పించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ మొదటి కేబినెట్‌లో.. రవాణాశాఖ మంత్రిగా మహేందర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.
2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డిపై.. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. అనంతరం జరిగిన కొన్ని పరిణామాలతో పైలెట్ రోహిత్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఇరువురు నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే పట్నం మహేందర్‌రెడ్డికి.. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని అధికార పార్టీ కట్టబెట్టింది. ఇటీవలే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీకి మొదటి నుంచి సేవలను గుర్తించిన కేసీఆర్.. మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.