Dharani passbook news : పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది. తహసీల్దారు/సంయుక్త సబ్ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళ్లకుండానే పాసుపుస్తకం అందేలా చర్యలు చేపడుతోంది. ధరణి పోర్టల్ అమల్లోకి రాకముందు (2020 నవంబరు) వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన వారిలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని మ్యుటేషన్ నిలిచిపోయినవారు రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఉన్నారు.
ఆ అవస్థలకు చెక్
ఇలాంటివారు మీసేవా కేంద్రాల ద్వారా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం గతంలో సూచించింది. దీంతో 1,75,861 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 1,75,217 పరిష్కరించారు. ఇప్పటికే మీసేవా ద్వారా డబ్బులు చెల్లించి దరఖాస్తు చేసిన వారి సెల్‌ఫోన్‌కు సందేశం పంపనున్నారు. వారు మీసేవలో ఈ-కేవైసీ సమర్పిస్తే చాలు(వినియోగదారుడెవరో రుజువు చేసేందుకు బయోమెట్రిక్‌లో వేలిముద్ర వేయడం).. వారి మ్యుటేషన్‌ను పూర్తి చేయనున్నారు. దీనివల్ల మీసేవా, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవస్థలు తప్పనున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసేవారు మీసేవా కేంద్రాల్లో వినియోగ రుసుం చెల్లించి, ఈ-కేవైసీ సమర్పిస్తే సమస్యను పరిష్కరించనున్నారు. పాసుపుస్తకం కూడా పోస్టులో నేరుగా ఇంటికి పంపనున్నారు.
రైతుల పాలిట శాపంగా ధరణి సమస్యలు
నిజామాబాద్ జిల్లాలో ధరణి సమస్యలు రైతుల పాలిట శాపంగా మారాయి. తమకు తెలియకుండానే భూములను ఇతరులకు కట్టబెట్టిన సిబ్బంది తప్పిదాలకు... అన్నదాతలు ముప్పతిప్పలు పడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కొలిక్కి రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణికి ధరణి సమస్యలు పోటెత్తుతున్నాయి. సగానికిపైగా దరఖాస్తులు భూసమస్యలపైనే ఉండటంతో కలెక్టర్... డివిజన్‌కు ఒక ధరణి ఇంఛార్జిని నియమించి ప్రజావాణికి హాజరయ్యేలా చూస్తున్నారు. దరఖాస్తులు పరిశీలిస్తున్న ఇన్‌ఛార్జ్‌లు పరిష్కారం చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో సిబ్బంది పట్టించుకోకపోవడంతో సమస్య మొదటికి వస్తోంది. ఒకే సమస్యపై పదే పదే కలెక్టర్ వద్దకు రావాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.