Parties Using Helicopters in Telangana Election Campaign 2023 :తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం (Election Campaign) ఊపందుకుంది. అధికార పార్టీ బీఆర్ఎస్‌తో పాటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఈసారి వేగంగా, విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి. ఇప్పటికే ఆరింటిని వాడుతుండగా.. ప్రచార పర్వం చివరి అంకానికి చేరేసరికి మరో నాలుగైదు జతయ్యే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఐదింటిని వినియోగించారు. అప్పట్లో ఎన్నికల సమయాల్లో సీఎంలు, పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రుల స్థాయిలోనే వాడేవారు. ఈసారి మంత్రులు, ముఖ్య నాయకులు సైతం హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అధికార పార్టీ బీఆర్ఎస్ రెండింటిని రెండు నెలల పాటు అద్దెకు తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ప్రచార అవసరాలకు అనుగుణంగా రెండేసి అద్దెకు తీసుకుంటున్నాయి.
2014, 2018 ఎన్నికల్లో 100కి పైగా కేసీఆర్ సభలు : కేసీఆర్ (KCR) తెలంగాణ ఉద్యమ సమయం నుంచి హెలికాప్టర్ ద్వారా సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. 2014, 2018 ఎన్నికల సమయాల్లో ఆయన ఇలా 100కి పైగా ప్రాంతాల్లో సభలకు హాజరయ్యారు. ఈసారీ అదే పంథాను అనుసరిస్తున్నారు. ఇప్పటికే ఆయన మూడు రోజుల్లో ఐదు నియోజకవర్గాల్లో పర్యటించారు. మరోవైపు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులు కూడా హెలికాప్టర్ల ద్వారా సభలకు హాజరవుతున్నారు.
Telangana Assembly Elections 2023 :ఇతర మంత్రులు, ముఖ్య నాయకులు సైతం ప్రచారంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ (BRS) ఈ సౌకర్యం కల్పించింది. నోటిఫికేషన్ తర్వాత ఇంకొకటి వినియోగించే అవకాశం ఉంది. షెడ్యూల్ వెలువడిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు తరచూ తెలంగాణలో పర్యటిస్తున్నారు. వారికి బీజేపీ (BJP) హెలికాప్టర్లను సమకూర్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కాంగ్రెస్ నేతలూ హెలికాప్టర్లను వాడుతున్నారు.
సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ ధర గంటకు రూ.1.5 లక్షల పైనే : తెలంగాణలో హెలికాప్టర్లను అద్దెకు ఇచ్చే పేరొందిన సంస్థలు లేకపోవడంతో.. రాజకీయ పార్టీలు బెంగళూరు, ముంబయి, దిల్లీలోని సంస్థలను సంప్రదించి అద్దెకు తీసుకుంటున్నాయి. గంటకు సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ ధర రూ.1.5 లక్షల నుంచి మొదలవుతుంది. అదే డబుల్ ఇంజిన్‌ది అయితే గంటకు రూ.2.75 లక్షలు. రోజువారీ అద్దె ప్రాతిపదికన కావాలంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు రూ.10 లక్షలు. అద్దె ధరలు ప్రియమైనా ఎన్నికల్లో గెలవాలనే తలంపుతో పార్టీలు ఖర్చుకు వెనకాడడం లేదు.