Parties Focus on Migrant Voters in Telangana : తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఓటర్ల చేతిలోనే అభ్యర్థుల రాజకీయ భవిష్యత్, తలరాత ఆధారపడి ఉంటుంది. వారిని ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని వారికి తెలుసు. అందుకే ఓవైపు నియోజకవర్గాల్లో ఓట్లు అభ్యర్థిస్తూనే.. మరోవైపు జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను (Migrant Voters) కనిపెట్టి.. పోలింగ్ రోజున తీసుకొచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
Telangana Assembly Elections 2023 :ఇందులో భాగంగా పొట్ట చేత పట్టుకుని, సొంతూళ్లను వదిలిపోయిన వారిని బాబ్బాబు.. ఒక్కసారి ఊరికి వచ్చిపో. నీ ఓటు నాకు వేసిపో.. అంటూ రాజకీయ పార్టీల నాయకులు ప్రాధేయపడుతున్నారు. సోలాపూర్, ముంబయి, పుణె వెళ్లి మరీ అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి జీవనోపాధి పొందుతున్న వారి రాక కోసం.. పెద్దఎత్తున ఆశలు పెట్టుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో వలస ఓటర్లు ఉండటమే ఇందుకు కారణం.
తెలంగాణ ఎన్నికల్లో యువత ఓటే కీలకం
Political Leaders Concentrated on Migrant Voters:ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల నుంచి.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటూ జీవిస్తున్న కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. తెలంగాణలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకంగా, మరో 15 చోట్ల పాక్షికంగా వలస ఓటర్లు ప్రభావం చూపుతారని పార్టీలు అంచనా వేస్తున్నాయి. వీరి కుటుంబాలకు సొంత గ్రామాల్లో ఆస్తిపాస్తులు ఉండటంతో.. సమాచారాన్ని సేకరిస్తున్న నేతలు.. వారిని రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఓట్లు మీవి.. ఖర్చులు మావి :డీసీఎంలు, రైళ్లు, బస్సులు ఇలా.. మీరు ఎలా వస్తామంటే అలా.. ఏర్పాట్లు చేస్తామనివలస ఓటర్లనునేతలు కోరుతున్నారు. రానూపోనూ ఖర్చులనూ చెల్లిస్తామని చెబుతున్నారు. పోలింగ్ నాడు (Telangana Assembly Elections 2023) వచ్చి, ఓటేసిపోవాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో బస్సుల్లో వస్తే ఒక్కొక్కరికి రూ.1500 వరకు ఖర్చు అవుతుందని.. ప్రత్యేకంగా డీసీఎంలు, లారీలు అద్దెకు తీసుకుంటే కొంత తక్కువ ఖర్చు అవుతుందని వారు లెక్కించారు. అందుకే అంత మొత్తం వారికి చెల్లించేలా నాయకులు ఒప్పందాలు చేసుకుంటున్నారు.