School Fee regulation meet: రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై చట్టం తీసుకురావాలని తెలంగాణ ఉపాధ్యాయ, పేరెంట్స్ అసోసియేషన్ సంఘాలు డిమాండ్ చేశాయి. ఫీజుల విషయంలో ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డాయి. హైదరాబాద్ బాగ్లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పలు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగటి నారాయణ ఆరోపించారు.
ప్రతి సంవత్సరం పదిశాతం ఫీజులు పెంచుకోవచ్చన్న తిరుపతిరావు కమిటీ ఆదేశాలను అమలు చేయవద్దని నారాయణ కోరారు. ఫీజుల అంశాన్ని పాఠశాలల స్థాయి కమిటీకి ఇవ్వాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం సాధన కోసం నిరంతరం ఉద్యమాల్లో పాల్గొనాలని టీఎస్టీసీఈఏ అధ్యక్షుడు సంతోశ్ కుమార్ సూచించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
స్కూల్ లెవెల్ ఫీ కమిటీ అనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్లుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఫీజుల నియంత్రణపై చట్టం తీసుకొస్తామని చెప్పి మోసం చేశారు. దీనిపై నియంత్రణ లేకపోవటం వల్లే యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.
- నాగటి నారాయణ, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు