parents for missing son: బిడ్డ కోసం ఎదురుచూసి ఆ కళ్లు అలసిపోయాయి. ఏళ్ల తరబడిగా ఏడ్చి ఆ తల్లి కన్నీరే ఇంకిపోయింది. వెతకని చోటు లేదు. తిరగని కార్యాలయం లేదు. కనిపించని కన్నపేగు కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూశారు. అయినా ఆఫీసుల్లో అధికారులు మారారే తప్పిస్తే కుమారుడి జాడ కనిపెట్టిన వారు మాత్రం ఒక్కరూ లేరు. ప్రకాశం జిల్లా మాటూరు గ్రామానికి చెందిన నరేష్, వనజ దంపతులు 2012లో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి శంషాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు.
అప్పటికే నాలుగేళ్ల వయసున్న కుమారుడు సంతోష్ కుమార్, కుమార్తె సంజన ఉండగా... వీరిని స్థానికంగా ఉన్న పాఠశాలలో చేర్పించారు. ఈ క్రమంలోనే 2013లో ఓ పాఠశాలకు వెళ్తుండగా బాబు తప్పిపోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌కు గురైనట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిర్లక్ష్య సమాధానాలిస్తూ కేసును పక్కన పెట్టినట్లు వారు వాపోతున్నారు.
ఈ పదేళ్ల కాలంలో ఎన్నోసార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా అధికారులు మారారు తప్పిస్తే, తమ బిడ్డ జాడ కనిపెట్టేందుకు కనీస ప్రయత్నం చేయలేదని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బతుకుదెరువు కోసం ఊరుగాని ఊరొచ్చిన ఆ దంపతులకు బిడ్డ తప్పిపోవటం తీరని వేదనను మిగిల్చింది.