‘‘ఆలుమగలు పోట్లాడుకునే సమయంలో తమ కదలికలను కన్నబిడ్డలు సునిశితంగా గమనిస్తున్నారని మరచిపోతున్నారు. కుటుంబంలో మనస్పర్థలు సాధారణం. అంతమాత్రానికే ప్రభావం చూపుతుందా! బుద్ధిగా పాఠశాలకు వెళ్లొచ్చే పిల్లలు ఇవన్నీ పట్టించుకుంటారా! అనే అభిప్రాయాన్ని వారి మనసు నుంచి తొలగించాలి’’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు. దంపతుల మధ్య మనస్పర్థలకు విడాకులే అంతిమ పరిష్కారంగా భావిస్తున్నారు. అక్కడ ఎవరుగెలిచినా ఇద్దరిమధ్య చిన్నారులు నలిగిపోతున్నారు.
సంసార జీవితంలో సర్దుకుపోలేక విడిపోయేందుకు మొగ్గు చూపుతున్న ఆలుమగల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఈ తరహా కేసులు ఏటా 20శాతం అధికమవుతున్నాయి. హైదరాబాద్‌లో చిన్నపాటి విషయాలకూ ఠాణాకు చేరుతున్న దంపతులూ పెరుగుతున్నారు. తమ మాట చెల్లుబాటు కావాలనే ఆలోచన.. ఆర్థిక స్వేచ్ఛతో తాము ఒంటరిగా జీవించగలమనే ధైర్యంతో విడాకులు పొందేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. వారి దాంపత్యానికి గుర్తుగా భూమ్మీదకు వచ్చిన కన్నబిడ్డలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారనే సున్నితమైన అంశాన్ని మరచిపోతున్నారు. రూ.లక్షల సంపాదనతో అన్నీ అందించగలమనే భావనలో ఉంటున్నారంటున్నారు మనస్తత్వ నిపుణులు.
తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి పెంపకంలోనే ఉండే పిల్లలు అభద్రతా భావంతో పెరుగుతారని హెచ్చరిస్తున్నారు. ప్రేమ, ఆప్యాయతలకు దూరమైన వారు ఆకర్షణలు, ప్రలోభాలకు తేలికగా గురవుతారంటున్నారు.
కాస్త సమయం.. మరింత మనోధైర్యం
- కాపురంలో గొడవలు సహజం. పిల్లల ముందు కోపతాపాలు ప్రదర్శించవద్దు.
- స్నేహంగా మెలుగుతూనే మేమున్నామనే భరోసా ఇవ్వాలి.
- ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలను పిల్లలు లేనపుడు చర్చించుకోండి.
- విడాకులు తీసుకున్నా పిల్లల ఆలనాపాలన ఇద్దరూ చూడడం వారికి ధైర్యాన్నిస్తుంది.
- వయసుతోపాటు పిల్లలతో మెలిగే తీరు మార్చుకోవాలి.
- నాణ్యమైన సమయం కేటాయిస్తూ మనసు పంచుకునే అవకాశం అందించాలి.
- పెరిగే పిల్లలపై తమ ప్రవర్తన ప్రభావం చూపుతుందని మరవద్దు.
- స్వేచ్ఛనిస్తూనే వారి కదలికలను గమనిస్తూ ఉండాలి