సర్పంచ్ల నిధుల దోపిడీపై తెలంగాణ పంచాయతీ ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్పంచ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ.. హైదరాబాద్‌లోని లక్డీకపూల్లో ఉన్న పంచాయతీ ఛాంబర్ కార్యాలయంలో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు వేసిన ఆర్థిక సంఘం నిధుల దోపిడీపై ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని తెలంగాణ పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. వారం రోజుల్లో తమ నిధులు తమకు ఇవ్వకపోతే చలో హైదరాబాద్ పేరిట ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పీఆర్ యాక్ట్ తీసుకొచ్చారని.. రాష్ట్రంలో 12 వందలకు పైగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం నిధులు విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుందని వాపోయారు. ఈ నిధులను నిబంధనలకు విరుద్ధంగా వాడుకుందని మండిపడ్డారు. స్టాంప్ డ్యూటీ, మైనింగ్ ఫీజులను ప్రభుత్వం తీసుకుంటుందని.. కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను సైతం దుర్వినియోగం చేస్తూ ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు.