Palvai Sravanthi Join BRS Party: శనివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి.. ఇవాళ బీఆర్ఎస్(BRS) పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్.. గులాబీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివంగత కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె అయిన స్రవంతి.. 2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడిన సమయంలో ఉపఎన్నిక రాగా.. ఆ పార్టీ నుంచి స్రవంతి పోటీ చేసి, 23వేలకు పైగా ఓట్లు సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్‌ను స్రవంతి ఆశించారు. కానీ, మారిన రాజకీయ పరిణామాల కారణంగా రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంతగూటికి రావటంతో ఆయనకే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీంతో పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న స్రవంతి(Palvai Sravanthi).. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
KTR Comments on Komati Reddy Venkat Reddy: మునుగోడు ఉపఎన్నిక(Munugodu ByElection)లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరూ రానప్పుడు.. పాల్వాయి స్రవంతి నిలబడి పార్టీ గౌరవాన్ని నిలబెట్టారని కేటీఆర్ తెలిపారు. పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆమె తండ్రి గోవర్ధన్ రెడ్డి సహకరించారని గుర్తుచేశారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి అహంకారానికి సరైన సమాధానం చెప్పాలని ధ్వజమెత్తారు. మునుగోడులో పాత, కొత్త లేకుండా అందరూ కలిసి పని చేయాలని సూచించారు.
తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్లు - మంచి నిర్ణయమే తీసుకుంటారు : మంత్రి కేటీఆర్
KTR on Telangana Development: సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ అభివృద్ధి చేశారని.. కులం, మతం, ప్రాంతం, వర్గం వంటి భేదాలు చూడకుండా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకువెళ్లామని పేర్కొన్నారు. కుల, మతాలు అడ్డుపెట్టుకుని ఏ రోజు కేసీఆర్ రాజకీయం చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరి పండిస్తోన్న జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని అన్నారు. అన్నిరంగాలో పురోభివృద్ధి సాధించామని హర్షం వ్యక్తం చేశారు.